కొండమల్లేపల్లి, మే 15: బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆరోపించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన దాదాపు 500 వందల మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధాన్యం తగులబెట్టి రాస్తారోకో, ధర్నాతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణలో రెండున్నరేండ్లలో రైతులు, విద్యార్థులు అగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలే రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. వరి కోతలు ప్రారంభమై నెలల గడుస్తున్నా.. వానాకాలం పంటల సీజన్ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు చాలా చోట్ల ధాన్యం కొనుగోలు పూర్తికాకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతోందని విమర్శించారు.
లారీలుంటే బస్తాలు ఉండవు, బస్తాలుంటే లారీలు రావు.. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రైతులకు ఈ దుస్థితి దావురించిందని వాపోయారు. ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా… తమ వడ్లు కొంటలేరని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, త్వరగా కొనేలా చూడాలని తమతో ప్రాధేయ పడుతున్నారని తెలిపారు. సెంటర్లకు వడ్లు తెచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదన్నారు.
టార్పాలిన్ల కిరాయి వేలల్లో కట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారని తెలిపారు. రైస్ మిల్లర్లు తరుగు పేరుతో ఒక్కో సంచికి 5 కిలోలు, కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో 3 కిలోల తరుగు తీసుకుంటూ రైతులను మోసం చేస్తూ దోచుకుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఇబ్బంది పెడుతోందన్నారు. కేసీఆర్ హయాంలో రైతులు వ్యవసాయం చేసి బంగారం కొనంటే.. నేడు రేవంత్ సర్కార్ హయాంలో ఉన్న బంగారం అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
ఇద్దరు మంత్రులున్నా ప్రయోజనం శూన్యం
అష్టకష్టాలు పడి పంట పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి కాంగ్రెస్ పాలనలో ఇబ్బంది పడాల్సి వస్తోందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు, తొమ్మది మంది ఎమ్మెల్యేలున్నా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎప్పుడూ ఏసీలలో కూర్చొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కాదు.. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 43 డిగ్రీల ఎండలో సైతం రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ పిట్టళ్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ తోలు తీయాలి
‘మాది ఇందిరమ్మ రాజ్యం. రైతు రాజ్యం అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతుల నడ్డివిస్తున్నారు’ అని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులుంటే లారీలు రావడం లేదని, లారీలుంటే సంచులు ఉండటం లేదని ఆరోపించారు. కొనుగోళ్లకు మందు గన్నీ సంచులు అందుబాటులో పెట్టకోవాలనే తెలివి, బుద్ధి ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని విమర్శించారు. వడ్లకు తాలు తీస్తే తోలు తీస్తానంటూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పడు రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని రవీంద్రకుమార్ గుర్తు చేశారు. ‘ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో 45 కిలోల చొప్పున తూకం వేస్తూ 10 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను జలగల్లా దోపిడీ చేస్తున్నారు.
మరిప్పుడు ఎవరి తోలు తీయాలి’ అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు కన్నీళ్లు పెట్టకుంటే రేవంత్ సర్కార్ కనికరం లేకుండా ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బిల్యా నాయక్, టీవీఎన్‌రెడ్డి, రమావత్ దస్రూనాయక్, దొంతు రాజశేఖర్‌రెడ్డి, వల్లపురెడ్డి, కంకణల వెంకట్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వెంకటేశ్వరెడ్డి, రమావత్ రమేష్ నాయక్, రమావత్ తులసీరాంనాయక్, రాజశేఖర్‌రెడ్డి, వెంకటేష్, రమావత్ దీప్లాల్ నాయక్, వేముల రాజు, బోడ్డుపల్లి కృష్ణ, లాలునాయక్,ఆర్వపల్లి నర్సింహ పాల్గొన్నారు.
దద్దమ్మ ప్రభుత్వం
రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. చిన్నఅడిశర్లపల్లి సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 రోజుల క్రితం వడ్లు తీసుకొచ్చిన. తేమ శాతం రాలేదని, తాలు ఉందని కొర్రీలతో గన్నీ సంచులు ఇవ్వడం లేదు. ఇప్పటికే ట్రాక్టర్ కిరాయి రూ.4 వేలు అయ్యింది. టార్పాలిన్కు ప్రతి రోజూ రూ.25 కిరాయి చెలిస్తున్న. తాలు వస్తున్నాయని, గింజలు చిన్నగున్నాయని రకరకాల కారణాలు చెప్పి మిల్లులోల్లు సతాయిస్తుండ్రు. అందరు పండించేవి గవ్వేనాయే. గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలనే పెట్టినం కదా.. వడ్లు ఎంత మంచిగా ఉన్నా మిల్లులోల్లు లోడ్ దించుకుంటలేరు. కాంటా అయినంక రోజుల తరబడి సెంటర్లనే వడ్లు నిలచిపోతున్నాయి. టైంకు లారీలు వస్తలేవు. వడ్లకు రేట్ సరిగా పెడతలేరు. వానాకాలం దగ్గరికి వచ్చే.. వడ్లు మాత్రం పోకపాయే.. రైతులు ఎంచెయ్యాలెనో అర్థమైతలేదు.
-ఇమ్మడి నర్సింహ, చిలకమర్రి గ్రామం, పెద్దఅడిశర్లపల్లి మండలం
బీఆర్ఎస్ హయాంలో ఇబ్బంది పడలేదు
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కరోనా టైంలో కూడా పంటలను మద్దతు ధరకు కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సర్కార్ అంటూనే పంటలను కొనుగోలు కేంద్రానికి వడ్లు తెస్తే పట్టించుకునే వారు లేరు. రోజూ ఉదయం వడ్లు ఆరబెట్టడం, సాయంత్రం దగ్గరికి చేయడమే సరిపోతోంది. తేమ శాతం చూస్తలేరు. గన్నీ సంచులు ఇస్తలేరు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలోనే అమ్మాలని చెబుతుంటే ఇక్కడ మాత్రం పట్టించుకుంటలేరు. వర్షం వస్తే వడ్లు తడిసి నష్టపోతామని భయపడి కొందరు రైతులు దళారులకు రూ.2 వేలకే అమ్ముకుంటున్నారు. ఈ సర్కార్ రైతులను ఇబ్బంది పెడతాంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండె. గత ప్రభుత్వం వెంటనే ధాన్యం కొని ఖాతాల్లో డబ్బులు వేసేది.
-ఇస్లావత్ నార్య నాయక్, బుడ్డోనితండా, చిన్నఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి మండలం