పెన్పహాడ్, డిసెంబర్ 08 : ఎన్నికల సమయంలో ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నియమావళిపై పోటీ అభ్యర్థులకు రైతు వేదికలో ఎస్పీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలన్నారు. గ్రామాల్లో అభ్యర్థులు ఎవరి ప్రచారం వారు నిర్వహించుకోవాలని, ఒకరిపై ఒకరు ద్వేషించుకోకూడదన్నారు. తమ ప్రచారాన్ని శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. గ్రామాల్లో వాహనాలు, మైక్సెట్లు వాడే అభ్యర్థులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయకూడదని, అభ్యర్థులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు మాత్రమే గ్రామాల్లో ప్రచారం నిర్వహించుకోవాలన్నారు. గ్రామాల్లో గోడ రాతలు, పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలపై వేయకూడదని, ప్రైవేట్ భవనాలపై వేసేప్పుడు తప్పనిసరిగా యజమానుల అనుమతి తీసుకుని ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేకంగా ఓటర్లును ప్రభావితం చేసే ప్రయత్నాలు డబ్బు, మద్యం ప్రలోభాలు, బెదిరింపులు కలిగించడం వంటి చర్యలపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. శాంతిభద్రత విషయంలో ఎంతటి వారినైనా ఎలాంటి రాజీలేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, తాసీల్దార్ లాలూ నాయక్, ఎంపీడీఓ జానయ్య, సీఐ రాజశేఖర్, ఎస్ఐ కాస్తాల గోపికృష్ణ, మండల ప్రత్యేక అధికారి రాములు పాల్గొన్నారు.