నేరేడుచర్ల, జనవరి 5 : హుజూర్నగర్ నియోజకవర్గం ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు అనంతరం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. ఆ మేరకు నిధులు ఇచ్చి అభివృద్ధికి పాటుపడుతున్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు, మండలానికి రూ.30లక్షల చొప్పున ఏడు మండలాలకు రూ.1.50 కోట్లు, ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున 134 గ్రామ పంచాయతీలకు రూ.28.80 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాలు, పార్కులు, నర్సరీలు, ఆటోనగర్ నిర్మాణం, బంజారా భవన్, సమీకృత మార్కెట నిర్మాణం చేపడుతున్నారు. మిర్యాలగూడ- కోదాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నేరేడుచర్ల, హుజూర్నగర్ పట్టణాల్లో రోడ్డును వంద అడుగుల మేర విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హుజూర్‌నగర్‌లో ఆర్డీఓ కార్యాలయంలో ఈఎస్ఐ ఆసుపత్రి, బంజారా భవన్, మేళ్లచెర్వులో గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణాలను పూర్తి చేశారు. అదేవిధంగా సుమారు రూ.130 కోట్లతో రోడ్లు, వంతెనల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని పూర్తి కాగా, మరికొన్ని పనులు జరుగుతున్నాయి.
నేరేడుచర్ల మున్సిపాలిటీలో రూ.25కోట్ల అభివృద్ధి
నేరేడుచర్ల మున్సిపాలిటీలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.12.7కోట్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.7.84 కోట్లు, సెంట్రల్ డివైడర్‌కు రూ.52 లక్షలు, డంపింగ్ యార్డు నిర్మాణానికి రూ.1.45కోట్లు, శ్మశానవాటికకు రూ.85లక్షలు, లైటింగ్ కోసం రూ.1.64 కోట్లు, సమీకృత మార్కెట్ ప్రహరీ నిర్మాణానికి రూ.33లక్షలు, గ్రంథాలయం నిర్మాణం కోసం రూ.30లక్షలు కేటాయించారు. ఆ పనులు జరుగుతున్నాయి.
ఏడు చెక్‌డ్యామ్‌లకు రూ.27 కోట్లు
మూసీ నది నీరు వృథా కాకుండా పొలాలకు అందించేందుకు నియోజకవర్గంలో రూ.27కోట్లతో ఏడు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. నేరేడుచర్ల మండలంలో దాచారం, సోమారం, పాలకవీడు మండలంలో మూసివొడ్డు సింగారం, శూన్యంపహాడ్, రాఘవాపురం, వేములూరి వాగుపై మఠంపల్లి మండలంలో గుర్రంబోడు తండా, చెన్నాయిపాలెం చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా పాలకవీడు, చింతలపాలెం మండలాల్లో రూ.7కోట్లతో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాల నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధం ఎమ్మెల్యే సైదిరెడ్డి వినతి మేరకు హుజూర్నగర్ పట్టణంలో మొదటి దశలో 1008 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరు చేశారు. రూ.5.90 కోట్లతో కరక్కాయలగూడెం, వేపల సింగారం, కదుబ్షాపురం, వెలిదండ గ్రామాల సమీపంలో సాగర్ ఎడమ కాల్వ, ముక్త్యాల కాల్వపై వంతెనలను నిర్మిస్తున్నారు.
రూ.35కోట్లతో పట్టణ ప్రగతి
హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో రూ.10 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, సమీకృత మార్కెట్ నిర్మాణానికి రూ.6.50 కోట్లు, గ్రంథాలయ నిర్మాణానికి రూ.83లక్షలు, వీధి వ్యాపారుల షెడ్ల కోసం రూ.95లక్షలు, పైప్‌లైన్ నిర్మాణం కోసం రూ.89లక్షలు, లైటింగ్ నిర్మాణం కోసం రూ.1.96లక్షలు, ట్యాంక్‌బండ్ నిర్మాణం కోసం రూ.6.50 కోట్లు, రూ.9.40 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
రూ.1600 కోట్లతో లిఫ్ట్‌ల నిర్మాణం
నియోజకవర్గంలోని ఆయకట్టుకు నీటిని అందించేందుకు రూ.1600 కోట్లతో లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ముత్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్, జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ సిమెంట్ లైనింగ్, జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్, ఎన్‌ఎస్‌ఎల్‌బీసీ సీసీ లైనింగ్ పనులు చేపట్టడానికి నిధులు మంజూరయ్యాయి. జాన్‌పహాడ్ – ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ -ఎన్‌ఎస్‌ఎల్‌బీసీ ఎత్తిపోతల కాల్వకు లైనింగ్ పనులకు రూ.340 కోట్లు మంజూరు చేశారు. పెదవీడు – మహంకాళిగూడెం లిఫ్ట్ మరమ్మతులకు రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. వీటన్నింటి పనులు కొనసాగుతున్నాయి.
నియోజకర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నా. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో ఇప్పటి వరకు రూ.3500 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టాం. గత ప్రభుత్వాల హయాంలో ఏ గ్రామంలో చూసినా సమస్యలు తాండవించేవి. ఇప్పుడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో దాదాపు 80శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశాం. మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తాం.
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి