దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, బీజేపీ పాలనతో విసుగెత్తిన యువతరం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎనిమిదేండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్నదని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడకు చెందిన నూతన ఓటర్లతోపాటు కాంగ్రెస్, బీజేపీ నుంచి దాదాపు 300 మంది యువకులు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చాక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ సర్కారు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతుండడంపై అన్ని వర్గాల ప్రజలతోపాటు యువత అసహనం వ్యక్తం చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధిని గాలికి వదిలి, మతం ముసుగులో రాజకీయం చేస్తూ దేశంలో చిచ్చు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం చిట్యాల మున్సిపాలిటీలో రూ.3కోట్ల సీసీ రోడ్డు పనులకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
– సూర్యాపేట టౌన్, జనవరి 5
సూర్యాపేట టౌన్, జనవరి 5 : దేశ భవిష్యత్తు యువత పైనే ఆధారపడి ఉందని, కేంద్రంలోని బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ఊహించని అభివృద్ధి సాధించిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నదన్నారు. అందుకే వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు యువత స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడలో 1, 2, 14 వార్డులకు చెందిన సుమారు 300 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చాక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడపీకడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ్రప్రైవేటుపరం చేస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో అన్ని రంగాల ప్రజలతో పాటు యువత కూడా విసుగుచెందుతుందన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తూ దేశంలో చిచ్చు పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ వల్లే దేశం తిరోగమనంలో పయనిస్తుందన్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే ప్రజలు ఆ రెండు పార్టీలను ఎన్నుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి బీఆర్ఎస్ పార్టీ వంటి సమర్ధ నాయకత్వం సీఎం కేసీఆర్ రూపంలో దొరికిందన్నారు.
రాబోయే కాలంలో దేశం గొప్ప మలుపు తిరుగబోతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో నానీ, దేసోజు రవి, మహంకాలి శివ, ప్రసన్న, శ్రవణ్, వంశీ, కార్తీక్, సాయి, ప్రసాద్, అశోక్, పవన్, సందీప్, సాయి, చింటూ, వెంకటేశ్, రమేష్, మణిదీప్‌తో పాటు 300 మంది ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుర్రం సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీ సంజీవ్ నాయక్, నాయకులు జీవన్ రెడ్డి, గుర్రం ప్రకాశ్‌రెడ్డి, నెమ్మాది భిక్షం, కౌన్సిలర్లు ఎలిమినేటి అభినయ్, గౌరయ్య, పగిళ్ల శంకర్, నరేందర్, నర్సింగ్, నాగరాజు, సాగర్ పాల్గొన్నారు.