సూర్యాపేటటౌన్/చివ్వెంల, ఫిబ్రవరి 17 : రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతర అయిన దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు రెండోరోజు సోమవారం భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్థరాత్రి నుంచి లక్షలాదిగా భక్తులు గుట్టపైకి చేరుకున్నారు. తమ ఇష్ట దైవానికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం తెల్లవారు జామున మద్దెరపోలు, ముత్యాలపోలు, లగ్గంపోలు కార్యక్రమం నిర్వహించారు. బైకాని వారు వాయిద్యాలు వాయిస్తూ గొల్లల చరిత్రను కథల రూపంలో తెలియజేస్తూ ఆలయహక్కు దారులైన మున్న, మెంతబొయిన వారి సమక్షంలో మద్దెర పోలు నిర్వహించారు.
బైకాని ప్రధాన పూజారి లింగమంతులస్వామి చౌడమ్మ గర్భగుడి ఎదుట ఉంచిన దేవరపెట్టె ముందు పసుపుతో ముగ్గులు వేశారు. ముగ్గులపై పోలుముంతలు ఉంచి, రెండు మట్టి కంచుడులో నెయ్యి, నువ్వుల నూనె పోసి దీపారాధాన చేశారు. బైరవ ఆకారంలో వేసిన ముగ్గులపై కుడకలు, తమలపాకులు, నిమ్మకాయలు, జీడిగింజలు పెట్టి బైకాని వారు మైసాక్షితో హారతినిచ్చారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌తో పాటు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ స్వామివారిని దర్శించుకున్నారు. జంతుబలితో పెద్దగట్టు ఎరుపెక్కింది. భక్తులు ఎడ్లబండ్లను పక్కకుపెట్టి.. ట్రాక్టర్లు, జీపులు, ఇతర వాహనాలపై జాతరకు వచ్చారు. జాతరలో సెల్‌ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. లింగమంతుల స్వామికి బోనం సమర్పించిన మహిళలు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టారు.