కోదాడ, ఏప్రిల్ 16 : ప్రజా సంక్షేమలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగానే కోదాడ 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం కోదాడ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ పరిశీలించారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోదాడ వంద పడకల ఆస్పత్రిని నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలలో రాజీ పడొద్దని, నాణ్యతలో ఏమైనా తేడాలు ఉంటే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోగులకు ఇబ్బంది కలగకుండా మెట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆస్పత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఆస్పత్రికి సరిపడా పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రుల్లో గర్భిణిలకు సాధారణ ప్రసవం జరిగేలా చుడాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, డిసిహెచ్ఎస్ చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ దశరథ నాయక్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తాసీల్దార్ వాజిద్ అలీ, డాక్టర్లు పద్మావతి, నరసింహ, లక్ష్మణ్, మెడికల్ ఈఈ రాజశేఖర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నాణ్యతా ప్రమాణాలతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్