చౌటుప్పల్, నవంబర్ 8: బీఆర్ఎస్ హయాంలో పరుగులెత్తిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం నే లచూపులు చూస్తోంది. కాంగ్రెస్ సర్కార్ విధానాల పుణ్యమాని ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా అవసరాల నిమిత్తం స్థలాలు, ఇండ్లు విక్రయించాలంటే నానా తంటాలు పడాల్సి వస్తోంది. అయినా కూడా కొనేవారే కరువయ్యారు. దీంతో చేసేదేమీలేక లక్కీ డ్రా(లాటరీ) రూపంలో విక్రయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల చౌటుప్పల్లో సుమారు రూ.16లక్షల విలువైన రేకుల గదితో కూడిన 66 గజాల ఇంటి స్థలాన్ని లక్కీ డ్రాలో సంగారెడ్డి జిల్లాకు చెందిన శంకర్ కుమార్తె హన్సిక (16 నెలలు) దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మండల పరిధలోని పంతంగి గ్రామానికి చెందిన తూర్పింటి రవి కూడా లాటరీ ద్వారా తన ప్లాటును విక్రయించేందుకు ముందుకొచ్చారు. ఆయనకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో 144 గజాల (రూ.20లక్షల విలువ) ప్లాటు ఉంది. ప్లాటును విక్రయించేందుకు ఆయన కొంతకాలంగా మార్కెట్లో పెట్టారు.
కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో లాటరీ (లక్కీ డ్రా) పద్ధతిలో విక్రయించేందుకు నిర్ణయించారు. దీంతో రూ.999లను కూపన్ ధరగా నిర్ణయించారు. డ్రా తేదీని వచ్చే ఏడాది జనవరి 26న ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం ఎంత దారుణంగా ఉందో ఈ లాటరీలే నిదర్శనం. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని లక్కీ డ్రా(లాటరీ) సంఘటనలు చూడాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా భూములకు ఈ దుస్థితి ఇంకా ఎన్నాళ్లో అంటూ నెట్టింట్లో కామెంట్లు వస్తున్నాయి.