రామగిరి, జూన్ 08 : పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండ పట్టణంలోని ఒకటో డివిజన్ పానగల్లులో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తుమ్మల పద్మ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం హాస్యాస్పదమన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని గత మార్చి నెలలో రూ.60 గ్యాస్ ధరలను పెంచి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మరొకసారి గ్యాస్ ధరలను రూ.29 పెంచిందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికీ నాలుగు సార్లు పెంచి సామాన్యులను, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.460 గ్యాస్ ధర రూ.1,030 కు పెంచి పేద ప్రజలను గ్యాస్ కు దూరం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి పార్లమెంట్‌ను సైతం స్తంభింపజేసి ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయని వార్తలు వస్తున్నాయని ప్రజలంతా ఆలోచించి ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు విస్తృతంగా రోడ్ల మీదకు రావాలని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం నడుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ ఉపాధ్యక్షురాలు ఆకిటి లింగమ్మ, కమిటీ సభ్యురాలు గోగుల బుజ్జమ్మ, గుండగోని సైదమ్మ, మైసమ్మ, దేవకమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, పార్వతమ్మ, సుస్మిత, ముత్తమ్మ, కలమ్మ, పి.లింగమ్మ పాల్గొన్నారు.