నల్లగొండ ప్రతినిధి, జనవరి10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిర్లక్ష్యానికి.. సంబంధిత మంత్రుల ఉదాసీనత తోడు కావడంతో సంక్రాంతి పండుగ పూట వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరమైన హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో పాటు ఏపీకి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రధాన రహదారుల పనులను పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్అండ్బీ మంత్రిగా ఉన్నా ఫలితం లేదు. నేషనల్ హైవే అధికారులపై ఒత్తిడి తెచ్చి చేపడుతున్న పనులను సత్వరమే పూర్తి చేయించడంలో ఆయన వైఫల్యం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక మంత్రి తన సొంత నియోజకవర్గమైన నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ రోడ్డుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను సైతం పూర్తి చేయించలేకపోవడం గమనార్హం. దీంతో నిత్యం వేలాది మంది వాహనాదారులు ఇక్కడ నరకం చూస్తున్నారు.
దీని నుంచి జనం దృష్టి మళ్లించేందుకు పండుగ ముందు మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న హడావిడిపై జనం మండిపడుతున్నారు. టోల్ మినహాయింపులంటూ… హైవేలపై పర్యవేక్షణ అంటూ ఆయన చేస్తున్న గిమ్మిక్కులపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. హైదరాబాద్- విజయవాడ హైవేపై శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణ రోజుల్లో ఈ హైవేపై రోజూ 30 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. పండగ రోజుల్లో ఈ సంఖ్య 50వేలు దాటుతుంది. వీకెండ్స్‌లోనూ హైవేపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అయినప్పటికీ హైవే మీద ప్రమాదాలకు నిలయంగా గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద చేపట్టిన పనులు రెండేండ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల్లో జాప్యం వల్ల నిత్యం వాహనాదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.
నేటికీ సర్వీసు రోడ్డు పనులు కూడా ముందుకు సాగడం లేదు. దీంతో నిత్యం చౌటుప్పల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వాహనాల రద్దీతో పట్టణ ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారు. వీకెండ్స్‌లో, పండుగ సమయాల్లో దూరప్రాంతాలకు వెళ్లే వాహనదారులతో పాటు స్థానికులు ఇక్కడ ఎదుర్కొనే ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఇక చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సైతం ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులతో వాహనాదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సర్వీసు రోడ్లు నిర్మించినా దారి ఇరుకుగా ఉండటంతో ఇక్కడకు వచ్చే సరికి వాహనాలు బారులు తీరుతున్నాయి. శనివారం ఈ బ్రిడ్జి నుంచి హైదరాబాద్ వైపుకు ఐదారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. చిట్యాలలో ఫ్లయ్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ సైతం అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో పట్టణ ప్రజలు రోడ్డు దాటాలంటే కనీసం రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోంది. ఇక్కడ బ్రిడ్జి పనులతో సర్వీసు రోడ్డుపైనుంచే వాహనాలన్నీ వెళ్తున్నాయి. దీంతో ఇరుకైన సర్వీసు రోడ్డుపై హైవే వాహనాలతో పాటు స్థానిక వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇలా జిల్లా పరిధిలోని హైవేలపై నత్తనడకన సాగుతున్న పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆర్అండ్బీ బ్రిడ్జిపై అంతులేని నిర్లక్ష్యం..
కాగా నల్లగొండ పట్టణంలోకి ప్రవేశించే మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పట్ల అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యం వల్ల నిత్యం నల్లగొండలోకి ప్రవేశించే వాహనాదారులతో పాటు నార్కట్‌పల్లి- అద్దంకి హైవే మీదుగా వెళ్లే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడమే శాపంగా మారింది. అప్పటి ప్రభుత్వం ప్రారంభించిన ఈ బ్రిడ్జిని తానేందుకు పూర్తి చేయాలనే ధోరణితో మంత్రి కోమటిరెడ్డి వ్యవహారశైలి ఉంది. 2022 మే 9న అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో నాటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.45 కోట్లు మంజూరు చేయించి, ఆ వెంటనే పనులు ప్రారంభించారు. కేసీఆర్ సర్కార్ ఉన్నన్ని రోజులు పనులు శరవేగంగా సాగాయి. కాంగ్రెస్ సర్కార్ రావడం, కోమటిరెడ్డి మంత్రి కావడంతో బ్రిడ్జి పనులు మూలనపడ్డాయి. ప్రజలు, మీడియా.. ప్రభుత్వంతో పాటు మంత్రి కోమటిరెడ్డి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పనులు మళ్లీ ప్రారంభించినా చిత్తశుద్ది కొరవడింది. దీంతో ఈ బ్రిడ్జి వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంక్రాంతి సమయంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ట్రాఫిక్ జామ్ తప్పదు. ఇరుకైన సర్వీసు రోడ్డుపై వాహనాలు నిలిచిపోతున్నాయి. తన శాఖ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్డిని పూర్తి చేయించడంలో మంత్రి నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు.
మంత్రి హడావిడిపై జనం సెటైర్లు..
హైవే పనులు వేగంగా పూర్తి చేయకుండా సంక్రాంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న హడావిడిపై జనం మండిపడుతున్నారు. హైవేలను బాగుచేయకుండా టోల్ చార్జీలు ఎత్తివేస్తామనడం, తానే స్వయంగా హైవేలపై తిరుగుతూ ట్రాఫిక్‌ను సరిచేస్తాననడంపై నెటిజన్లు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రి కొత్తగా ఇప్పుడే ఈ హైవేలపై ప్రయాణం చేస్తున్నట్లు పనులు పరిశీలించడం లాంటివాటిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభు త్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పైపై హడావిడి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జిమ్మికులు, పొలిటికల్ స్టంట్లతో జనం ఇబ్బందులు తొలగిపోవని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. వాహనదారులకు పట్టపగలే చుక్కలు..!
చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్, జనవరి 10: సంక్రాం తి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
శనివారం నుంచి పండుగ సెలవులు రావడంతో సొం తూళ్లకు వెళ్లేవారితో వాహనాలు బారులుదీరాయి. దీం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవే విస్తరణ పనులు ప్రారంభించి రెండేండ్లు గడస్తున్నా పూర్తికాలేదు. కాంట్రాక్టర్ ఈ పనులను గత ఏడాదిన్నరలోనే పూర్తి చేయాల్సి ఉంది. దీంతో చౌటుప్పల్‌లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చిం ది. మండల పరిధిలోని తూప్రాన్‌పేట, ధర్మోజిగూడెం అండర్ పాస్ నిర్మాణంలో భాగంగా వంతెన పనులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. చౌటుప్పల్‌లో సర్వీసు రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. దీనికి తోడు స్థానిక బస్టాండ్ సమీపంలో ఫ్లయి ఓవర్ పనుల ఉసే లేదు. దీంతో సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనాదారులు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ చిక్కులు తప్పడంలేదు. చౌటుప్పల్ దాటలంటే ఆరగంటకు పైగానే సమయం పడుతోంది. ప్రధానంగా తంగడపల్లి, వలిగొండ క్రాసింగ్‌ల వద్ద వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. దీంతో కొంతమంది వాహనదారులు సర్వీసు రోడ్డు ద్వారా వెళుతున్నారు. సర్వీసు రోడ్లు రద్దీగా మారడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. అలాగే తంగడపల్లి క్రాస్ రోడ్డును మూసివేయడంతో సంస్థాన్ నారాయణపురం వైవు వెళ్లే వాహనాదారులు వలిగొండ క్రాసింగ్ వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాలి. ఇక్కడ ఆదివారం సంత ఉండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద…
పంతంగి టోల్‌ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో టోల్ ప్లాజా గుండా 40 వేల వాహనాలు వెళ్తుంటాయి. వీకెండ్, శుభాకార్యాలు ఉంటే మరో 5వేలు ఆదనం. ప్రతి ఏటా సంక్రాంతి పం డుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. గత ఏడాది భోగి పండుగ ముందు రోజూ 84,262 వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లాయి. పం డుగ ముందు మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.07 లక్షల వాహనాలు వెళ్లాయి.