– సూర్యాపేట ఎస్ఈ కార్యాలయం ఎదుట కోదాడ రైతులతో కలిసి ధర్నా
కోదాడ, సెప్టెంబర్ 11 : ప్రస్తుతం ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి బోరు బావుల కింద రైతులు వేసుకున్న పంటలు సాగు చేసుకుందామంటే రైతులకు కరెంటు ఇవ్వాలనే కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేదని, రైతుల పంటలు ఎండిపోతే ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కోదాడ నియోజకవర్గంలో కరెంట్ కోతలు నివారించాలని, రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి సూర్యాపేట ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి ఎస్ఈ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాబావ పరిస్థితులున్నాయని ఉన్న కొద్దిపాటి బోరు బావుల కింద తిండి గింజల మందం సాగు చేసుకుంటే కరెంట్ కోతలతో వేసుకున్న పంటలు కళ్లముందే ఎండిపోతుంటే భరించలేని రైతులు రోడ్లపైకి వచ్చి దర్నాలు చేసినప్పటికీ నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రబుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు.
రైతులను ఆదుకోవాల్సిన ప్రబుత్వం బొగ్గు అమ్ముకొని రైతును రోడ్డు మీద పడేస్తుందన్నారు. కృష్ణానీటిని పక్క రాష్ట్రానికి తీసుకుపోతుంటే నిద్ర పోతున్నారని నిజంగా పంటలు పండితే దాన్యం ఎక్కడ కొనాల్సి వస్తుందోనని రైతులు పంటలు పండించకుండా ప్రభుత్వం కరెంటు, నీళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. పచ్చని పొలాలు ఎండిపోయే దుస్థితి ఉన్నందున రైతుల పక్షాన నాణ్యమైన విద్యుత్‌ను కనీసం 12గంటలైనా ఇవ్వాలని, చెరువులు నింపుకునేందుకు భూగర్భజలాలు పెరగడానికి ఉపయోగపడే సాగర్ నీళ్లను రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మిర్యాలగూడెంలో కేటీఆర్ సభలో చెప్పినట్లుగా ఆయకట్టు ప్రాంతానికి ఏ రకంగా నీళ్లు ఇస్తారో క్యాలెండర్ ప్రకటించాలని లేని పక్షంలో తప్పకుండా పాదయాత్ర మొదలు పెడుతామన్నారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని రైతుల మోటార్లు కాలిపోతున్నాయని దీంతో అదనపు భారం పడుతుందని ట్రాన్సఫార్మర్లు కాలిపోతే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో కనురెప్ప పాటు కూడా కరెంట్ పోని రాష్ట్రంలో మళ్లీ కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉన్నతాధికారులకు సూచనలు చేసి సక్రమంగా నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందించి పంట పొలాలను కాపాడాలన్నారు. అలాగే రైతులకు ఎన్నెన్ని రోజులు నెలకు ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు కోతలు అయ్యేంత వరకు నీళ్లను విడుదల చేస్తారో క్యాలండర్‌ను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు వెంటనే మరమత్తు చేయాలని, ఉదయం సాయంత్రం వేలల్లో విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని, విద్యుత్ ట్రిప్పింగ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రస్తుతం ఎస్ఐని కలసి విన్నవించామన్నారు. తీరు మారకుంటే సక్రమమైన విద్యుత్ రాకపోతే హైవేని దిగ్బందిస్తామని, రైతుల సమన్వయంతో అన్ని సబ్ స్టేషన్లను ముట్టడిస్తామని రైతుల పక్షాన రైతుల కోసం బీఆర్ఎస్ ముందుండి పోరాడుతుందన్నారు. ఈ ధర్నాలో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

రైతులకు విద్యుత్ అందించకపోతే హైవే దిగ్బంధనం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్