త్రిపురారం, జూన్ 18 : మెట్ట వరిసాగు ద్వారా తక్కువ ఖర్చుతో లాభాలు గడించవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మిర్యాలగూడ ఏరియా మేనేజర్ తారక్ సుబ్బుసింగ్ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో రెడ్డి ప్రసాద్ వ్యవసాయ క్షేత్రంలో మల్టీక్రాప్ ప్లాన్ఎంటర్ సీడ్ డ్రిల్ సహాయంతో వరి విత్తనాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్టవరి సాగులో పొలాన్ని బురద చేసి గొర్రు తోలిన అనంతరం కేవలం 3 నుంచి 4సార్లు దుక్కిదున్నినా సరిపోతుందన్నారు. నారుమడిలో నారు పెంచాల్సిన అవసరం లేకుండానే, నాటు వేయడానికి కూలీలు లేకుండానే పంట పండించవచ్చని తెలిపారు.
ఈ పద్దతిలో దొడ్డురకం వడ్లు 15 నుంచి 20 రోజులు, సన్నరకం వడ్లు 12 నుంచి 15 రోజులలోపు మొలకెత్తుతాయన్నారు. రైతులు మెట్ట వరి సాగుతో ఖర్చు తగ్గించుకుని లాభాలు గడించవచ్చన్నారు. రెడ్డి ప్రసాద్ గత నాలుగేండ్ల నుంచి ఇదే పద్దతి అవలంభిస్తున్నారని, లాభాల బాటలో పయనిస్తున్నారని, రైతులు మెట్ట వరిసాగుపై దృష్టి సారించి పంటలు వేసి ఖర్చులు తగ్గించుకోవాలని తెలిపారు. ఆయన వెంట సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ రాసికపు సరిత, జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ గున్రెడ్డి ప్రమీల ఉన్నారు.