– పలుచోట్ల రోడ్లపైకి వరద ఉధృతి
– ప్రయాణికుల తీవ్ర అవస్థలు
– మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే పద్మావతి ఆగ్రహం
– మాజీ సర్పంచ్ ఎర్నేని లోతట్టు ప్రాంతాల పరిశీలన
కోదాడ, ఆగస్టు 08 : ఎడతెరిపు లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచి కొట్టింది. దీంతో పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి రావడంతో పట్టణ ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువు నుండి వరద పెరిగింది. దీంతో కోదాడ అనంతగిరి రోడ్డులో వరద నీరు రోడ్డు పైనుండి ప్రవహిస్తుండడంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందిగా మారాయి. అతి కష్టం మీద భారీ వాహనాలు మాత్రమే వరద నీరు దాటి వెళ్తున్నాయి. ప్రధాన రహదారి ప్రక్కన డ్రైనేజీ లేకపోవడం వల్ల వరద నీరు రహదారిపైకి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రహదారిలో కోదాడ పెద్ద చెరువు వద్ద కూడా అలుగు పోయడంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి.
శుక్రవారం మధ్యాహ్నం వరద తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగించారు. కోదాడ పట్టణంలో సైతం గుడిబండ రోడ్డులో రోడ్డుపైకి వర్షపు నీరు రావడంతో అధికారులు డివైడర్లను తొలగించాల్సి వచ్చింది. లేకుంటే వరద నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ఇక పట్టణంలోని శిరిడి సాయినగర్ లో సైతం గుర్రపు డెక్క అడ్డుగా ఉండడంతో వరద నీరు రహదారిపైకి రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజుల నుంచి కాలనీవాసులు సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ గ్రామ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు గుర్రపు డెక్క ఉన్న స్థలాన్ని పరిశీలించి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే హుటాహుటిన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరుగుతున్నప్పటికీ సకాలంలో చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు గుర్రపు డెక్కను తొలగించడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
రెండు గంటల పాటు వర్ష తీవ్రతతో కోదాడ పలు ప్రాంతాల్లో వరద నీరు చేరిన నేపథ్యంలో, వరుసగా రెండు మూడు రోజులు వర్షం కురిస్తే కోదాడ మళ్లీ జల ప్రాంతం అవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలపై ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగించకుండా చోద్యం చూస్తూ ఉండడంతో వానాకాలం సమయంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 1న వరద ఉధృతికి కోదాడ పట్టణం మునిగిపోయి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం పట్ల పట్టణ ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
Kodada : కుంభవృష్టితో కోదాడ పట్టణ ప్రజలు అతలాకుతలం
Kodada : కుంభవృష్టితో కోదాడ పట్టణ ప్రజలు అతలాకుతలం