కృష్ణానదీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తితే ఇక కృష్ణానదిపై రాష్ట్ర పరిధిలోని తొలి ప్రాజెక్టు జూరాలకు వరద నీరు రానున్నది.
జూరాలలో కూడా ఇప్పటికే నీరు నిల్వ ఉండడంతో పై నుంచి వరద ఉధృతి కొనసాగితే మూడునాలుగు రోజుల్లోనే జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు తరలిరానున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 11 రోజుల ముందుగానే ఆల్మట్టి డ్యామ్ గేట్లు తెరుచుకోవడం విశేషం. దాంతో ఈ ఏడాది పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుందన్న అంచనాలతో నాగార్జునసాగర్ ఆయకట్టుపై ఆశలు చిగురిస్తున్నాయి.
వారం రోజులుగా కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరంతో పాటు పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కృష్ణానదిలో వరద ఉధృతితో ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటి నిండుతూ వస్తున్నాయి. కృష్ణానదిపై తొలి ప్రాజెక్టు ఆల్మట్టి పూర్తిగా నిండడంతో మంగళవారం సాయంత్రమే 14 గేట్లు ఎత్తి 65వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆ తర్వాత ఇన్‌ఫ్లో కొద్దిగా తగ్గి బుధవారం ఉదయం 6గంటలకు ఆల్మట్టికి 61,683 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదైంది.
పవర్ హౌస్ ద్వారా అవుట్‌ఫ్లోగా 17,563 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ డ్యామ్‌కు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టికి ఎగువ నుంచి ఏ మాత్రం ఇన్‌ఫ్లో పెరిగినా ఆ నీరంతా దిగువకే విడుదల చేయనున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లో సైతం ప్రస్తుతం 37.64 టీఎంసీల కెపాసిటీకి గానూ 28.76టీఎంసీ నీరు నిల్వ ఉంది. ఎగువ వరదను బట్టి డ్యామ్ గేట్లను త్వరలోనే ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జూరాల ప్రాజెక్టుకు వరద రానుంది. జూరాలలో ప్రస్తుతం 9.66 టీఎంసీకుగానూ 7.66 టీఎంసీ నీరు నిల్వ ఉంది.
ఇక పైన ఏమాత్రం వానలు కురిసినా..
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు 3,585 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం 215.80 టీఎంసీల నీటి నిల్వకు గానూ 33.62 టీఎంసీలు ఉంది. శ్రీశైలం నుంచి విద్యుత్తు ఉత్పత్తి ద్వారా 30,912 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లోగా నాగార్జునసాగర్‌కు చేరుతుంది. దాంతో సాగర్ నీటిమట్టం బుధవారం సాయంత్రం 6గంటలకు 504.60అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటినిల్వ 312.50 టీఎంసీలకు గానూ 122.68టీఎంసీల నీరు ప్రస్తుతం ఉంది.
గతేడాది ఆల్మట్టిలో ఇదే రోజు పరిశీలిస్తే 26టీఎంసీలే ఉండగా ప్రస్తుతం 99.24 టీఎంసీలు ఉండడం విశేషం. నారాయణపూర్, జూరాల, తుంగభద్ర డ్యామ్‌లలో సైతం గతేడాదితో పోలిస్తే ఈ సారి అదనపు నీటి నిల్వలే కనిపిస్తున్నాయి. దీని వల్ల ఇక ముందు ఎగువన ఏ మాత్రం వర్షాలు కురిసినా ఆ వరద శ్రీశైలం వైపునకే రానుంది. ఆ తర్వాత శ్రీశైలానికి వరద మొదలైతే విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేయవచ్చు. అందుకే నాగార్జునసాగర్ ఆయకట్టుపై ఆశలు చిగురిస్తున్నాయి.