అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా పడింది. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో రికార్డు స్థాయిలో 17.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వాన పడడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గ్రామాలు, కాలనీలు చెరువులను తలపించాయి. ఆలేరు నియోజకవర్గంలోని పలు రహదారులపై వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నల్లగొండ జిల్లాలో సగటున 8.8 మి.మీ సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లాలో 1.25 సెంటీమీటర్లు నమోదైంది. హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుంచి మూసీకి వరద పోటెత్తుండడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు రెండింటిని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2,663 క్యూసెక్కులు ఉండగా, మరింతగా పెరిగితే మిగిలిన గేట్లనూ ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. రానున్న మూడ్రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తుండడంతో విద్యుత్ శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. మరోవైపు మెట్ట పంటలు జీవం పోసుకుంటుండగా, రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
నల్లగొండ, జూలై 20: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మూడ్రోజులుగా ముసురు కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కురిసే వర్షం కాస్త ముసురు రూపంలో పడడంతో కురిసినా ప్రతి చినుకు పంట చేలకు జీవంగా మారడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు సైతం దోహదపడుతుంది. మోస్తరు నుంచి భారీ వర్షం పడడంతో చెరువుల్లోకి నీరు చేరుతుంది. వాతావరణం చల్లబడి చల్లని గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా బీఆర్ఎస్ రై తు సమావేశలు సైతం వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
జిల్లా అంతటా ముసురు
అల్పపీడనంతో జిల్లా అంతటా మూడ్రోజులుగా ముసురు కురుస్తున్నది. మూడో రోజు గురువారం జిల్లాలో అత్యధికంగా అనుములలో 33.3 మిల్లీ మీటర్లు. వర్షం కురువగా దామరచర్లలో 31.8, త్రిపురారంలో 31.0, నిడమనూరులో 28.8, నకిరేకల్‌లో 28.8, చింతపల్లిలో 27.0, మర్రిగూడలో 26.0, నాంపల్లిలో 22.5, గుర్రంపోడులో 21.0, శాలిగౌరారంలో 20.0, నార్కట్ పల్లిలో 18.3, తిప్పర్తిలో 14.0, చండూర్లో 13.8, చిట్యాలలో 12.8, మిర్యాలగూడలో 11.5, కట్టంగూర్‌లో 11.3, అడవిదేవులపల్లిలో 11.0, దేవరకొండలో 11.0, గుండ్లపల్లిలో 10.3, మునుగోడులో 7.5, పీఏ పల్లిలో 6.8 మిల్లి మీటర్ల వర్షం కురిసింది. నల్లగొండ, మాడ్గులపల్లి, వేముల పల్లి, చందంపేట, నేరేడుగొమ్ము, కనగల్, కేతేపల్లి మండలాల్లో ఐదు మిల్లి మీటర్ల లోపు వర్షం పడింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 161.7 మిల్లి మీటర్ల వర్షం పడాల్సి ఉండగా 141.5 మి.మీ. వర్షం మాత్రమే పడటంతో 13 శాతం లోటులో ఉంది. సగటున 8.8 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది.
మరో మూడ్రోజుల పాటు ఇదే పరిస్థితి
మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి నెల కొనే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ వరుస వర్షాల కారణంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు నిండి వాగులు పొంగే అవకాశం ఉంది. దీంతో ్ట ప్రభుత్వం ముందస్తుగా గురు, శుక్రవారం రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
అన్నదాతల్లో ఆనందం…
వర్షాలు ఆలస్యం కావడంతో కాస్త గాబరా పడ్డ రైతాంగం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 6.5 లక్షల ఎకరాల్లో పత్తి, మరో 12 వేల ఎకరాల్లో ఇతర మెట్ట పంటలు సాగు కాగా ఈ ముసురు ఆ పంటలకు జీవం పోయనుంది. ఇక ఇప్పటికే 52 వేల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు మిగిలిన పొలం సైతం సాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉం డగా ఆయా ప్రాం తాల్లో ఈ వర్షం కారణంగా పలు చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండగా మూసీ ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నిండు కుండల్లా మారుతున్నాయి.
ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధ్దంగా ఉండాలి: కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి
నల్లగొండ ప్రతినిధి, జూలై 20(నమస్తే తెలంగాణ) : గడిచిన మూడు రోజులుగా జిల్లాలో వర్షం పడుతుండగా ఈ వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ, పశు నష్టం జరగకుండా అందరూ అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి ప్రజలు, అధికారులకు సూచించారు. ఆయన వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం కారణంగా వాగులు, నదులు పొంగి చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం వల్ల ఇలాంటి ఘటనలు జరిగితే ట్రాఫిక్ ఇతర ప్రాంతాల నుంచి మళ్లీంచాలన్నారు. ఇరిగేషన్ అధికారులు చెరువుల పరిస్థితి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఏ ప్రాంతంలోనైనా తెగితే తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు చెరువుల్లోకి చేపలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వంద శాతం విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలే అవకాశం ఉంటదన్నారు. వర్షాలకు పంట పొలాలు నష్టం జరిగితే నివేదిక ఇవ్వాలన్నారు.
అవసరమైతే తప్ప బయటకు రావద్దు : ఎమ్మెల్యే చిరుమర్తి
నకిరేకల్, జూలై 20: భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. శిథిలావస్థలో నున్న ఇళ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. డ్రైనేజీ, కాల్వలు, చెరువులు, వాగులు, వంకల వద్దకు వెళ్లకూడదని, పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఇనుపస్థంభాలు, ఇనుప పరికరాలు, సిమెంటు స్తంభాలు కూడా ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు.
ప్రజలు అప్రమ్తతంగా ఉండాలి: ట్రాన్స్‌కో ఎస్ఈ చంద్రమోహన్
నల్లగొండ సిటీ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో ఎస్ఈ చంద్రమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తడిసిన విద్యుత్ స్తంభాలు ముట్టుకొవద్దని, విద్యుత్ లైన్లకు చెట్లు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. పార్క్, స్డేడియాల్లో విద్యు త్ స్తంభా లను ముట్టుకోవద్దని ఇంట్లో ఉన్న స్వీచ్ బోర్డులను తడి చేతులతో తాకరాదని పేర్కొన్నారు. బావుల వద్ద రైతులు మోటర్లకు విద్యుత్ సరఫరా కాకుంటే సంబంధిత విద్యుత్ అధికారులకు తెలపాలని స్వయంగా మరమ్మతులు చేసి ప్రమాదాలు కోని తెచ్చుకోవద్దని కోరారు. వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న ఫ్యాన్, టీవీ, ఫ్రీజ్ స్వీచ్‌లను ఆఫ్ చేయాలని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట : జిల్లాలో 12.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికం మోతే మండలంలో 32.4, అత్యల్పం చింతలపాలెంలో 1 మిల్లీ మీటర్లు నమోదైంది. తిరుమలగిరిలో 27.8, నూతనకల్-25.5, ఆత్మకూర్.ఎస్-20.8, మద్దిరాల-18.3, నాగారం- 17.3, చివ్వెంల-15.2, పెన్‌పహా డ్-14.7, గరిడేపల్లి-13.9, జాజిరెడ్డిగూడెం-13.8, తుంగతుర్తి- 13.5, నడిగూడెం-12.8, మునగాల-11.8, సూర్యాపేట-11.7, అనంతగిరి-10.6, హుజూర్నగర్-10, చిలుకూరు, పాలకీడు, మట్టంపల్లి, కోదాడ, నేరేడుచర్ల, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 5.3 నుంచి 1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ) : అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పట్టపగలే చిమ్మచీకట్లు అలుముకున్నాయి. రెండ్రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది.
పాముకుంటలో 17.6 సెంటీమీటర్లు
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాజాపేట మండలం పాముకుంటలో 17.6 సెంటీమీటర్లు, రాజాపేట 15, ఆలే రు మండలం కొలనుపాక 9, యాదగిరిగుట్ట 8.5, ఆలేరు మండలం శారాజీపేటలో7.6, మోటకొండూర్ 7.3, భువనగిరి పట్టణం 5.9, బొమ్మలరామారం మండలం చేర్యాల 5.6, బొమ్మలరామారం 5.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.