సూర్యాపేట, మే 21 : ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గంట నుంచి రెండు గంటలపాటు వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వర్షానికి పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. పిడుగుపడి పశువులు మృతి చెందాయి. వరద పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతోపాటు గాలిదుమారానికి విద్యుత్ సరఫరాలో అక్కడక్కడ అంతరాయం ఏర్పడింది. దుక్కులు దున్నేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), నూతనకల్ మండలాల్లో పెద్దఎత్తున్న వర్షం పడింది. సుమారు రెండు గంటలపాటు వర్షం పడింది. సూర్యాపేట మండలంలో 66.5 మిల్లీమీటర్లు, చివ్వెంల 60.1, నూతనకల్ 46.0, ఆత్మకూర్(ఎస్)42.3, మద్దిరాల 41.3, మోతె 40.0, చిలుకూరు 25.5, హుజూర్నగర్ 24.5, నాగారం 19.3, తుంగతుర్తి 18.5, గరిడేపల్లి 18.0, మఠంపల్లి 12.0, నడిగూడెం 11.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పిడుగుపాటుకు జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో 10 మేకలు, కోదాడ మండలం నల్లబండగూడెంలో 36 మేకలు చనిపోయాయి. పెన్పహాడ్ మండలం అనంతారంలో, ఆత్మకూర్.ఎస్ మండలంలో ఏపూరులో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది.
Heavy Rain
తిప్పర్తి : నల్లగొండ జిల్లాలో పలు మండలాల్లో వర్షం పడింది. పీఏపల్లి, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, నిడమనూరు, గుర్రంపోడు, మునుగోడు, తిప్పర్తి, కేతేపల్లి, నకిరేకల్, నార్కట్పల్లి, కట్టంగూరు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురువగా శాలిగౌరారం, దేవరకొండ మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. పలు మండలాల్లో పిడుగులు పడ్డాయి. నల్లగొండ మండలం అప్పాజిపేట పరిధిలోని బంటుగూడెం గ్రామంలో పిడుగుపాటుకు వ్యవసాయ బావి వద్ద తోటలో పనిచేస్తున్న మహిళా రైతు చనిపోయింది. పిడుగు పడడంతో కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామంలో రెండు బర్రెలు చనిపోయాయి. పెదఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టు గ్రామంలో రెండు ఆవులు మృతి చెందగా మరో ఇద్దరు సృహ తప్పి కింద పడిపోయారు.