యాదాద్రి భువనగిరి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)/ భువనగిరి కలెక్టరేట్: జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా దంచికొట్టింది. భువనగిరి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూదాన్‌పోచంపల్లి నుంచి బీబీనగర్ వెళ్లే మార్గంలో రుద్రవెల్లి దగ్గర మూసీ నది పొంగిపొర్లుతున్నది. దాంతో రాకపోకలు బంద్ అయ్యాయి.
ఆ మార్గం మీదుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామ పరిధిలోని భీమలింగం కత్వా లోలెవల్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తుండడంతో సంగెం-బొల్లేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూదాన్‌పోచంపల్లి నుంచి పెద్దరాలపల్లి మీదుగా బీబీనగర్‌కు వెళ్తున్నారు. భారీ వర్షంతో గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు రోడ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
అత్యధికంగా యాదగిరిగుట్టలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భువనగిరిలో 13.2, బొమ్మలరామారంలో 9.9, మోటకొండూరులో 9.5, ఆలేరులో 6.8, నారాయణపురంలో 6.8, ఆలేరులో 6.8, తుర్కపల్లిలో 5.6, రాజాపేటలో 3.9, చౌటుప్పల్‌లో 3.3, ఆత్మకూరు(ఎం)లో 3.2, భూదాన్‌పోచంపల్లి 2.3, బీబీనగర్‌లో 1.9, గుండాలలో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 20 : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో జూలూరు – రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భూదాన్ పోచంపల్లి – బీబీనగర్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. పొలాల్లో వరద పారుతుండడంతో యువకులు చేపల వేట కొనసాగిస్తున్నారు.
బీబీనగర్ హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో మూసీ వంతెన పైనుంచి వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో బీబీనగర్ – పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు బందయ్యాయి. భద్రతా చర్యల్లో భాగంగా తాసీల్దార్ శ్రీధర్ అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బారికేడ్లు ఏర్పాటు చేసి వంతెనను మూసివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున రాత్రివేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
వలిగొండ : ఎగువన సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. మండలంలోని సంగెం గ్రామం భీమలింగం కత్వ వద్ద ఉన్న లోలెవల్ వంతెన పైనుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సంగెం – బొల్లేపల్లి గ్రామాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. స్థానిక పోలీసులు ముందు జాగ్రత్తగా ప్రమాదాల నివారణకు ప్రత్యేక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మూసీ నది వైపు ప్రయాణికులు, వాహనదారులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ మహేందర్‌లాల్ తెలిపారు.
యాదగిరిగుట్ట : మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 170.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పలు చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మండలంలోని చొల్లేరు వాగు ప్రవహించింది. దీంతో గ్రామానికి వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా, కొద్దిరోజులుగా వర్షం లేకపోవడంతో వరి, పత్తి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. తాజాగా కురిసిన వర్షానికి పంటలకు జీవం పోసినట్లయిందని రైతులు సంతోష పడుతున్నారు.