యాదాద్రి భువనగిరి, జూన్ 22 ( నమస్తే తెలంగాణ) : ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా బీఆర్ఎస్ సరార్ మంజూరు చేసిన హెల్త్ సబ్ సెంటర్ల పకా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోపోవడంతో ఎకడి పనులు అకడే నిలిచిపోయాయి. దీంతో పేదలకు మెరుగైన సేవలు అందని ద్రాక్షగానే మారింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాలు, పల్లెల్లో దవాఖానలకు పకా భవనాలు, ఆధునిక పరికరాలు సమకూర్చింది. మారుమూల ప్రాంతాల్లో సైతం ఉత్తమ సేవలు అందించేందుకు హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 137 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా సెంటర్లకు సొంత భవనాలు ఉండగా, మరికొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఉప కేంద్రాల్లో ఇబ్బందులు తొలగించేందుకు గత ప్రభుత్వం జిల్లాకు 80 ఉప కేంద్రాలకు పకా భవనాలను మంజూరు చేసింది. ఒకో భవనానికి రూ. 20 లక్షల చొప్పున సుమారు రూ.16కోట్లు కేటాయించింది.
జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలకు పకా భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నాలుగు శాఖలకు భవన నిర్మాణ పనులు అప్పగించారు. కొన్నింటికి టెండర్లు పూర్తి కాగా, మరికొన్ని టెండర్ దశలోనే ఉన్నాయి. జిల్లాలో 20 హెల్త్ సెంటర్లలో భవన నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ఫండ్స్ విడుదల కాకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి. అనేక చోట్ల బేస్మెంట్ స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే పనులు ముందుకు సాగనున్నాయి.
హెల్త్ సబ్ సెంటర్లను బీఆర్ఎస్ సరార్ బలోపేతం చేసింది. ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోగులు, గర్భిణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పోషకాహార లోపం ఉన్న వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, కుష్టు, క్షయ రోగులకు వైద్యుల సూచనల మేరకు మందులు ఇస్తున్నారు. చిన్నారులకు టీకాలు వేస్తున్నారు. గ్రామాల్లో జనన, మరణాలను నమోదు చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే అరకొర వసతులతో నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇరుకు గదుల్లో నెట్టుకొస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్నాయి. దాంతో రోగులు, సిబ్బంది ఇబ్బందులు ఎదురొంటున్నారు. కొత్త భవనాలను నిర్మిస్తే ఇబ్బందులు
తొలగనున్నాయి.
జిల్లాలో 80 ఆరోగ్య ఉప కేంద్రాలకు పకా భవనాలు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని చోట్ల పనులు ప్రారంభయ్యాయి. మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయి. నిధుల కొరతతో పనులు ఆగిపోయాయి. భవనాల నిర్మాణం పూర్తయితే వైద్య సదుపాయాలు మెరుగవుతాయి. త్వరలోనే పనుల పూర్తికి చర్యలు తీసుకుంటాం.
-పాపారావు, డీఎంహెచ్ఓ
గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రానికి సొంత భవనం లేదు. అద్దె ఇంటిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య ఉపకేంద్రం సొంతభవనం నిర్మాణం కోసం 15 సంవత్సరాల క్రితం 3లక్షల రూపాయలు మంజూరు చేసినా పిల్లర్ల వరకే నిర్మాణ పనులు పరిమితమయ్యాయి. అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న ఉప కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి భవనాన్ని పూర్తి చేయాలి.
– కాలె మల్లేశ్, మాజీ వైస్ ఎంపీపీ, పల్లెపహాడ్, ఆత్మకూరు(ఎం)