నీలగిరి, ఏప్రిల్ 25: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా జనగణన (2027)ను ఆదివారం నుంచి జిల్లాలో ప్రారంభిస్తున్నామని, మొదటి విడతగా స్వీయ గణన, రెండో విడతగా ఇండ్ల వారీ గణన ఉంటుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానాన్ని ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్వీయ గణన ప్రక్రియ ఈ నెల 26 నుంచి మే 10 వరకు నిర్వహిస్తామన్నారు. జనగణనను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహిస్తున్నదని మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ హౌస్ సెన్సెస్ ఉంటుందని, ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన ఉంటుందని తెలిపారు. ముఖ్యమైన స్వీయ గణనలో అందరూ భాగస్వాములు కావాలని, తమ వివరాలను స్వయంగా అధికారిక వెబ్ పోర్టల్ se.census.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇందులో 34 రకాల ప్రశ్నలు ఉంటాయని అవి కూడా జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆస్తుల తదితర వివరాలు ఉంటాయని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని, నమోదు పూర్తయ్యాక మొబైల్ లేదా ఈమెయిల్‌కు ఒక SE ID వస్తుందన్నారు. ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈSE ID చూపిస్తే ఏలాంటి తప్పుల్లేకుండా సులభంగా నమోదవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల సిబ్బంది, సాధారణ ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. తప్పులు తగ్గుతాయి. కచ్చితమైన సమాచారం లభిస్తుంది. జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, గ్రామీణ-పట్టణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించేందుకు వీలుంటుందన్నారు.
రెమ్యునరేషన్ ఎప్పుడిస్తరు సారూ..
గతంలో జనగణనలో పని చేసిన ఎన్యుమరేటర్లకు ఇప్పటివరకు రెమ్యునరేషన్ అందలేదని విలేకరులు కలెక్టర్‌ను ప్రశ్నించారు. స్పందించిన కలెక్టర్ నిధులు అందిన వెంటనే ఎన్యుమరేటర్లకు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సీపీవో శ్రీనివాస్ నాయక్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జనగణనపై స్పెషల్ ఫోకస్! యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
జనగణన- 2027లో భాగంగా స్వీయ గణనపై ప్రతి ఒకరూ దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జన గణనను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇండ్ల గణన, రెండో విడతలో జనగణన నిర్వహిస్తామని పేరొన్నారు. డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన, స్పష్టమైన జాబితా రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
స్వీయ గణన నిర్వహణలో భాగంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ వ్యక్తులు, గణన అధికారులు, యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా విసృ్తత ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన పోర్టల్ అందుబాటులో ఉంటుందని, జిల్లాస్థాయి జనగణన అధికారులు ప్రతిరోజు స్వీయ గణన వివరాలను నవీకరించాలని పేరొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వీయ గణన విషయం అందరికీ తెలిసే విధంగా విసృ్తత ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు స్వీయ గణన కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో https://sc.census.gov.in వెబ్ సైట్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని తెలిపారు.