తిరుమలగిరి జూన్ 7 : వాన కాలం సీజన్ జిల్లాలో రోహిణీ కార్తెతోనే ప్రారంభం అవుతుంది. సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోసి, ఆరుద్ర కార్తెలో పనులు ముమ్మరం చేస్తారు. ఇప్పటికే వాన కాలం సాగుకు అనువైన రోహిణి కార్తె కూడా పూర్తి కావస్తున్నది. అయినా ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సాగు ప్రణాళిక ఖరారు చేయలేదు. దీనితో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. వాన కాలం సీజన్లో జిల్లాలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉంది. ఏ రకమైన విత్తనాలు అవసరం.. యూరియా ఎంత అవసరం అనేవాటిపై అంచనా వేసి రైతులకు విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉంచా ల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్లాన్ లేదు.
సన్నద్ధమవుతున్న రైతులు..
రోహిణీ కార్తె ప్రారంభం కావటంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధం అవుతున్నారు. బోరు బావు ల కింద సాగు చేసే రైతులు ఇప్పటికే బురద మళ్లు దున్ని కొన్ని చోట్ల నారు కూడా పోశారు. వరి నాట్ల కోసం మడులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కార్తె 15 రోజుల పాటు మాత్రమే ఉంటుంది. జిల్లాలో అత్యధికంగా వరి సాగు అవుతుండగా రెండవ పంటగా పత్తి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వరి తోపాటు పత్తి సాగు చేసే రైతులు దుక్కులు దున్నకంతో పాటు పెంటమట్టి తోలకం ,చెత్తాచెదారం తొలగించి చేనును అనుకూలంగా మార్చుకుంటున్నారు.
సిద్ధం కాని యాక్షన్ ప్లాన్..
రోహిణీ కార్తెలో వరి సాగు చేయాలనుకునే రైతులు ఇప్పటికే విత్తనాలు, ఎరువుల కోసం ఫర్టిలైజర్ షాపులను ఆశ్రయిస్తున్నారు. ముందుస్తుగా డీఏపీ బస్తాల ను కొనుగోలు చేస్తున్నారు. అయినా జిల్లాలో వాన కాలం యాక్షన్ ప్లాన్ మాత్రం సిద్ధం కాలేదు. రైతులు ఏ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ? వారికి కా వాల్సిన విత్తనాలు ఏమిటీ, ఏరకాలు ఆశిస్తున్నారు, అవి ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయి, విత్తనా లు, ఎరువులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంచనాలతో రైతులకు భరోసా కల్పించే యాక్షన్ ప్లాన్ లేక పోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మంత్రి ప్రకటనతో మరింత ఆందోళన
వ్యవసాయ శాఖ మంత్రి ఇటీవల నీటి సౌకర్యం ఉన్న రైతులు వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని చెప్పటంతో రైతుల్లో మరింత గందళగోళం మొదలైంది. అసలు ప్రభుత్వం ఏపంటలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఏరకమైన సాగు చేయాలి అనే విషయం స్పష్టం చేయక పోవటం వానకాలం సీజన్ కూడా ప్రారంభం కావటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
యూరియా కొరత..
గత సీజన్లో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారాలు మాని మరీ యూరియా కొనుగోలు చేశా రు. యూరియా కోసం అన్నదాతలు పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చింది. మళ్లీ ఆలాంటి పరిస్థితులు వస్తే సాగు కత్తిమీద సాములా మారుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ వ్యవసాయ శాఖ రైతులకు ఎరువులు ,విత్తనాలు అందుబాటులో ఉంచాల్సి ఉంది. వెంటనే వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేయాలని రైతులు కోరుతున్నారు.
కష్టాలు లేకుండా చూడాలి
అందరికీ అన్నం పెట్టే రైతుకు సాగు కష్టాలు లేకుండా చూడాలే. గతంలో లాగా యూరి యా కష్టాలు ఉంటే ఇక సాగుచేయటం కష్టమే. వ్యవసాయ అధికారులు ఎరువులు, విత్తనాలకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే వానకాలం వరి ,పత్తి సాగు కోసం రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ సారి రైతులకు పెట్టుబడి మరింత భారం కానుంది. ఇప్పటికే ఎరువుల ధరలు ,డీజిల్ ధరలు పెరగటంతో రైతులకు ఈ సారి వానకాలం సాగు పెట్టుబడికి కష్టాలు తప్పేటట్లు లేదు.
-శ్రీను నాయక్, రైతు, కోక్యా తండా