సూర్యాపేట (నమస్తే తెలంగాణ)/కోదాడ, మే 7 : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వన్నీ ఉత్తర ప్రగల్భాలేనని, రైతులను నట్టేట ముంచుతూ ఏదో సాధించినట్లు గప్పాలు కొడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్త మ్ కుమార్‌రెడ్డి కనీసం తన సొంత జిల్లాలో అయినా సమస్యల్లేకుండా చూసుకుంటాడనుకున్నానని, కానీ ఇక్కడకు వస్తే కానీ ఆయన సక్కదనం తెలిసిందంటూ ఎద్దేవా చేశారు.
కోదాడ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆమె లేని కిందనే లెక్క అని, ఓటమి పాలైన మల్లన్న ప్రజలకు అందుబాటులో ఉంటుంటే ఎమ్మెల్యే మాత్రం క్యాంపు కార్యాలయం నుంచి వీడి యో కాల్స్‌లో మాత్రమే దర్శనమిస్తోందని ఇదేం విడ్డూరమో…అర్థం కావడం లేదన్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ చేసిన మోసాలకు నేడు ప్రజలు బలవుతున్నారని ఇంకా రెండున్నరేండ్లు తప్పదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే జనం మార్పు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు పోతుందో…కేసీఆర్ ఎప్పుడు వస్తా రో అని ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల పార్టీ అన్ని కమిటీలను రద్దు చేశారని, త్వరలో సభ్యత్వ నమోదు చేపట్టి నూతన కమిటీలు ఏర్పాటు చేస్తారన్నారు. సభ్యత్వాలను రికార్డు స్థాయిలో చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఓటరు జాబితా సవరణ కోసం చేపడుతున్న సర్ ద్వారా బీఆర్ఎస్ అనుకూలంగా ఉండే ఓటర్లను తొలగించకుండా అప్రమత్తంగా ఉం డాలని పిలుపునిచ్చారు.
హుజూర్‌నగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మం త్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సతీమణి పద్మావతి రెడ్డి ఇద్దరూ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని హరీశ్‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ విమానంలో టూరిస్టు మాదిరి ఢిల్లీకి తిరుగుతుంటే ఉత్తమ్ హైదరాబాద్ నుం చి జిల్లాకు గాలి మోటారులో వచ్చి గాలి మా టలు చెబుతున్నాడన్నారు. కోదాడలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ఎమ్మెల్యే ఎక్కడ ఉంటుందో అర్థం కావడం లేదని ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మాజీ ఎమ్మెల్యేను కలుస్తున్నారే తప్ప ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదన్నారు. ఇదేం పాలన… ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు.

ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీని బొందబెట్టి బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ లెక్కన భవిష్యత్తు మనదేనని పార్టీ శ్రేణులకు హరీశ్‌రావు భరోసా కల్పించారు. కాంగ్రెస్ వారు ఏ రకం గా అక్రమ కేసులు పెడుతున్నారో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నేర్చుకుంటున్నారని ఈ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కోదాడలో అన్యాయంగా కర్ల రాజేష్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, రాజేష్ చావుకు కారకులైన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పార్టీ పరంగా అందరూ కలిసి పనిచేయాలని, మన లక్ష్యం కేసీఆర్ సీఎం కావాలని, అం దుకు గానూ అంతా కలిసి పని చేద్దామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్ ఏజెంట్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఓట్లు పోకుండా చొరవ తీసుకోవాలని, కొత్త పిల్లలకు ఓటుహక్కు కల్పించాలంటూ.. మీరు ఎంత చేస్తే రేపు మన గెలుపు అంత సులువు అవుతుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే బొల్లం మల్లయ్య యాదవ్, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్ నాయకులు బండా నరేందర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, విద్యాసాగర్, పల్లె రవికుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

దశాబ్దాల తరబడి నీళ్లకు నోచుకోని ఈ ప్రాంతాన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అం దులో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గంలో బీళ్లుగా ఉన్న మోతె, మునగాల, నడిగూడెం మండలాల్లోని పొలాలకు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ -2 ద్వారా నీళ్లు వచ్చి పచ్చని మాగాణమైందన్నారు. అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ పండబెట్టి మళ్లీ భూములు ఎండబెడుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంత్రి ఉత్తమ్ తరచుగా ప్రెస్మీట్లు పెట్టి ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నాడని, మరి అలా చేస్తే రైతులు రోడ్లపైకి ఎందుకు వచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.