నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్3(నమస్తే తెలంగాణ) : నడిగూడెం మండలం పరిధిలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్టకు గండ్లు పడిన ప్రాంతంలోని రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇన్నేండ్లు తమ జీవితాలకే ఆదరువుగా నిలిచిన కాల్వ కట్ట కండ్ల ముందే తెగిపోతున్నా ఏమీ చేయాలని నిస్సహాయస్థితిలో చూస్తుండి పోయారు. కాల్వ కట్ట తెగడమే కాదూ ఆ నీరంతా ఉగ్రరూపం దాల్చుతూ క్షణాల్లో తమ పంట పొలాలను ముంచెత్తుతున్నా కాపాడుకోలేక పోయారు. ఇలా జీవనాధారమైన పంటపొలాలను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న రైతులు బీఆర్ఎస్ బృందం ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు.
మంగళవారం మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పి.సబితాఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల రామచంద్రాపురం పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఆదివారం ఉదయం గండ్లు పడిన విషయం తెలిసిందే. ఎడమ కాల్వకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించి, జరిగిన నష్టాన్ని, వాస్తవ పరిస్థితులను బాధిత రైతులను హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు. హరీశ్‌రావు తదితరులు వస్తున్న విషయం తెలిసిన బాధిత రైతులు పెద్ద సంఖ్యలో కాల్వ కట్టపైకి తరలివచ్చారు.
కాల్వ కట్టపైకి చేరుకున్న నేతలను చూడగానే రైతులు ఎదురెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అసలు కట్ట తెగడానికి కూడా ఈ సర్కారులోని మంత్రులే కారణమని రైతులు తమ ఆవేదనను చెప్పుకొచ్చారు. కాల్వ కట్ట తెగిన ప్రాంతంలో పొలం కొట్టుకుపోయిన బాధిత రైతు నీలకంఠ వెంకటేశ్వర్లు ముందుగా జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించారు. ఎండాకాలంలో ఖమ్మం నీళ్లు తీసుకుపోయేందుకు ఎస్కేప్ ఛానళ్లకు వెల్డింగ్ టాకాలు వేయడం వల్లనే తూములు ఎత్తలేకపోయామని చెప్పారు. ‘2024 ఏప్రిల్ 12న ఖమ్మం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న ఫలంగా వీఆర్ఏలు, ఫీల్డ్ అసిసెంట్లు, పోలీసోళ్లను ఒక్కో తూముకు నలుగురిని పెట్టి నీళ్లు తీసుకుపోయారు. అప్పుడే వెల్డింగ్‌లు పెట్టి సీల్ చేశారు.
తర్వాత వీటిని తొలిగించకుండానే ఇప్పుడు నీళ్లు వదిలారు. మొన్న వచ్చిన వరదకు సాగర్ నుంచి వచ్చే కాల్వ నీళ్లు…. వాటికి పాలేరు నుంచి కాల్వలోకి ఎదురెక్కిన వరద నీళ్లు కలిపి కాల్వకు ముప్పు తెచ్చాయి. ఇది జరుగుతుంటే ఎస్కేప్ ఛానళ్ల తూములను ఎత్తుదామంటే వెల్డిండ్ చేయడం తో అవి రాలేదు. అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. దాంతో చూస్తుండగానే కా ల్వ కట్ట మీద నుంచి నీళ్లు పొంగిపొర్లుతూ రెం డు చోట్ల కట్ట తెగిపోయింది’ అని వివరించారు. ఇక అక్కడే పెద్ద ఎత్తున గుమికూడిన మహిళా రైతులు హరీశ్‌రావు వద్దకు వచ్చి తమ పొలాల్లో ఇసుక మేటలను చూడాలంటూ తొడ్కోని వెళ్లారు. కాల్వకట్ట మీద నుంచి కనుచూపు మేరలో వరద నీరు, ఆ నీటి కింద ఇసుక మేటలే పొలాలను కమ్ముకుని ఉన్నాయి.
బాధిత రైతులు, గోడు విన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందిస్తూ ‘అమ్మా మేము… కేసీఆర్ తోలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం అందరం వచ్చాం. వాస్తవ పరిస్థితిని చూసి అంచనా వేసేందుకు వచ్చాం… మీరు చెప్పిన మాటలన్నీ విన్నాం. ఇసుక మేటలు వేస్తే ఆ పొలం మళ్లీ పనికిరాదు. దాన్ని బాగు చేయాలంటే చాలా కష్టం. నష్టపోయిన వరి పొలాలకు ఎకరాకు కనీసం రూ.30వేల పరిహారం, ఇసుక మేటలు వేసిన పొలాలకు కనీసం రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. అసెంబ్లీలో మాట్లాడుతం. మీ అందరికీ మేలు జరిగేలా మా వంతు సహకారం ఉంటది. మీరు ధైర్యంగా ఉండాలి.’ అని హరీశ్‌రావు బాధిత రైతులకు భరోసా కల్పించారు.
కాల్వకట్టపై మహిళలంతా ఒక్కసారి తమ గోడును ఆవేదనను వెళ్లబోసుకున్నారు. పిచ్చమ్మ అనే మహిళ కాల్వ తెగిన పరిస్థితిని వివరిస్తూ… ‘ఉదయం 6గంటలకు పొలాలకు వద్దకు మా సార్ వెళ్లిండు… కాల్వ ఫుల్ వస్తుందని, కాల్వకు వేసిన మోటార్లు తీసేద్దామనికి తాడు కోసం ఇంటికొచ్చిండు. ఇంటి కాడ తాడు తీసుకుని వాళ్ల నాన్న కూడా వెంట పెట్టుకుని కాల్వకట్ట మీదకు పోయిండు. అప్పటికే మోటార్లు మునిగిపోయినయ్. కాల్వ ఫుల్ వస్తుంది… పొంగిపొర్లుతున్నది… ఇక మన వల్ల కాదులే అని కాల్వ తెగుద్దేమో అని ఇంటికొచ్చాడు. అప్పుడే ఒక ఆఫీరమ్మ వచ్చింది.. కానీ ఆమె తూములు లేపుకుంటూ గేట్లు ఎత్తుకుంటూ వస్తే బాగుండేది.
ఆ నీళ్లు వెళ్లిపోయేది… కాల్వ తెగకపోయేది. ఏమీ చేయకపోనూ.. తన చెప్పులకు అంటిన బురదను కాల్వ నీళ్లతోనే కడుక్కుని వెళ్లింది. ఆమె అలా వెళ్లిందో లేదో… కాల్వ తెగిపోయింది.’ అని చెప్పింది. అక్కడే ఉన్న హారిక అనే మరో మహిళ స్పందిస్తూ ‘కాల్వ తెగడంతో ముందు వరదనీళ్లు ఊరుమీద పడ్డయ్. ఇండ్లలోకి నీళ్లు రాగానే తాళా లు వేసుకుని కట్టుబట్టలతో బయటకొచ్చినం.. సగం ఊరు ను నీళ్లు చుట్టముట్టినయ్… ఆ తర్వా త కాల్వ పక్కనే ఉన్న ఇంకో కట్ట తెగడంతో పొలాల మీద పడ్డయ్’ అని చెప్పుకొచ్చింది. ‘కాల్వ కట్ట తెగడంతో మనిషిలోతు వరద పోయింది… పొలాలు పోతే పోయినవి గానీ ఇసుక మేటలు పెట్టా యి… మోటార్లు కొట్టుకుపోయాయి… పొలం ఇంకా వరద నీళ్లలోనే ఉంది.’ అని మరో మహిళ సుగుణమ్మ చెప్పుకొచ్చింది. ‘వరద ఎక్కువైనప్పుడు కాల్వ తూములు ఎత్తితే ఈ బాధే ఉండేది కాదూ… వీటిని సీల్ చేశారు. లాకులు తీద్దామంటూ వెళ్లలేదు. ఎండాకాలంలో వెల్డింగ్ చేశారు.. అందుకే ఎత్తలేకపోయామని మహిళలంతా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
కాల్వ గండ్లు ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే జరిగాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దురదుష్టవశాత్తు ప్రకృతి విపత్తు వల్లనే నష్టం జరిగి ఉంటే ఇలాంటి ఆపత్కాలంలో ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన అవసరం గానీ, రాజకీయాలు చేయాల్సిన అవసరం గానీ లేదని తమకు లేదని స్పష్టం చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్న వాళ్లమన్నారు. కానీ ఆశ్చర్యంగా ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరదల్లో ప్రజలు కొట్టుకుపోతుంటే రెండు రోజుల వరకు పత్తా లేడని ఆరోపించారు. వరద ప్రాంతాన్ని చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ఎందుకు సీఎం, మంత్రులు రాలేదని ప్రశ్నించారు.
ఖమ్మం పట్టణం కొట్టుకుపోడానికి ప్రజలు చచ్చిపోవడానికి ప్రభుత్వమే కారణమని, ఇది బాధ్యతారహిత్యంతో మాట్లాడడం లేదని, తొమ్మిది గంటలు సాయం కోసం కండ్ల ముందు ఎదురు చూస్తుంటే కూడా కనీసం ఒక్క హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేయలేదు అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యాక మొసలి కన్నీరు కారుస్తూ… రంగంలోకి దిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. హెలికాప్టర్ సమకూర్చాల్సిన సీఎం ఏమయ్యాడన ప్రశ్నిస్తూ… వరదల్లోని ప్రజలను గాలికి వదిలేసి సీఎం, మంత్రులు జల్సాల్లో ఉన్నారని విమర్శించారు. ఇంకా వీరితోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, గోపగాని వెంకటనారాయణగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, ఈదయ్య, భోనగిరి ఉపేందర్, తదితరులు ఉన్నారు.