మునుగోడు ,మే 27 : మునుగోడు మండల ఇన్చార్జి ఎంపీడీఓ విజయ్ భాస్కర్ వివిధ గ్రామాల కార్యదర్శుల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన సామాజిక కార్యదర్శుల మీద కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగురి నరసింహ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కార్యదర్శులపై ఇన్చార్జి ఎంపీడీఓ కక్ష సాధింపులకు వ్యతిరేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అనగారిన వర్గాలకు చెందిన కార్యదర్శులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఎక్కడా లేని విధంగా ఏ, బీ, సీ గ్రేడ్లు చేసి కార్యదర్శులను, ఇతర మండలాలకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం సరైంది కాదని మండిపడ్డారు.
అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటివరకు ప్రజా ప్రతినిధుల పాలన లేకున్నా గ్రామ అభివృద్ధి కోసం ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ నిత్యం కృషి చేస్తున్న కార్యదర్శులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, బదిలీలు చేయడం సరైంది కాదన్నారు. అలాగే చిరు వ్యాపారస్తుల మీద ఇన్చార్జి ఎంపీడీఓ కక్ష సాధింపులు మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి చాపల శ్రీను, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్, మాజీ జడ్పీటీసీ గోసుకొండ లింగయ్య, మండల కార్యవర్గ సభ్యులు ఉప్పునూతల రమేశ్, దుబ్బ వెంకన్న, వనం వెంకన్న, మండల కౌన్సిల్ సభ్యులు ఎండీ జానీ, కురుమర్తి ముత్తయ్య పాల్గొన్నారు.