మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యం గా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తున్నది. పథకాలను తాయిలాల రూపంలో ఎర వేస్తూ ఓట్లను దండుకొంటున్నది. ఎన్నికలు ఉన్న దగ్గర మాత్రమే స్కీంలను అమలు చేస్తున్నది. ఇందుకు ఉదాహరణే చేనేత రుణమాఫీ. యాదాద్రిభునగిరి జిల్లా వ్యా ప్తంగా రుణమాఫీ ఉండగా, కేవలం ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నది. మిగతా ప్రాం తాలకు మొండిచెయ్యి చూపిస్తున్నది. హస్తం ప్రభుత్వ తీరుపై చేనేత కార్మికులు భగ్గుమంటున్నారు.
యాదాద్రి భువనగిరి, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు గాలికొదిలేస్తున్నది. నేతన్నల కుటుంబాలను ఆగమాగం చేస్తున్నది. చేనేత రుణమాఫీ చేస్తామని 2024 సెప్టెంబర్ 9వ తేదీన హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో నేతన్న వర్గాల్లో ఆశలు చిగురించాయి. జిల్లా నుంచి చేనేత జౌళి శాఖ అధికారులు ప్రతిపాదనలు కూడా రాష్ర్టానికి పంపించారు. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం జాప్యం చేస్తూ వచ్చింది. ఒక అడుగు ముం దుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగింది. చేనేత రుణమాఫీ కోసం మార్గదర్శకాల పేరుతో ఇంకింత ఆలస్యం చేసింది. గతేడాది మార్చిలోనే నిధులు మంజూరైనా మాఫీ మాత్రం చేయలేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపా రం, తయారీ రంగం ఉంది. సుమారు 20వేల మంది చేనేత కార్మికులు ఉంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి, పుట్టపాక, నారాయణపురం, ఆలే రు, యాదగిరిగుట్ట, మోత్కూరు, భువనగిరి, కొయ్యలగూడెం తదితర ప్రాంతాల్లో చీరలు అధికంగా నేస్తారు. జిల్లాలో 43 సొసైటీలు ఉండగా, వేలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. చేనేత కార్మికులు మగ్గాల ఏర్పాటుకు, ఉత్పత్తికి ముడి సరుకు కొనుగోలు కోసం రుణాలు తీసుకుంటారు. ఇందులో అధిక భాగం కోఆపరేటివ్ సొసైటీలు, బ్యాంకుల ద్వారా పొందుతారు. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న వారే అర్హులుగా గుర్తించారు. ఎంత రుణం తీసుకున్నా లక్ష మాత్రమే మాఫీ అవుతుంది. రూ. లక్షకు మించి రుణం ఉన్నా రూ.లక్ష వరకు మాత్రమే క్లియర్ చేస్తారు. బ్యాంకుల ఒత్తిడి మేరకు కొందరు బయట అప్పు చేసి రుణాలు చెల్లించారు. లోన్ కట్టినోళ్లకు కూడా మాఫీ డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి.
మరో రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కేవలం మున్సిపాలిటీల్లో ఉన్న నేతన్నలకు మాత్రమే నిధులు విడుదల చేసింది. వాస్తవానికి జిల్లాలో 2380 కార్మికులకు 19.25 కోట్ల రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కానీ ప్రస్తుతం కేవలం ఆరు మున్సిపాలిటీలకు కలిపి 1160 మంది కార్మికులకు 9.60 కోట్లు విడుదల చేసింది. పోచంపల్లిలో 824 మందికి రూ. 7.24 కోట్లు, యాదగిరిగుట్టలో 13 మందికి రూ. 8.30లక్షలు, భువనగిరిలో 63 మందికి 35.48లక్షలు, ఆలేరులో 151 మందికి 1.10 కోట్లు, చౌటుప్పల్‌లో 89 మందికి రూ. 67.85 లక్షలు, మోత్కూరు మున్సిపాలిటీలో 20 మందికి రూ. 14లక్షల మేర నిధుల విడుదలయ్యాయి. ఇవి ఇప్పటికే ఆయా బ్యాంకులకు చేరారు. రేపోమాపో ఖాతాల్లో జమకానున్నాయి. ఇక మున్సిపాలిటీలు పోగా మిగిలిన ప్రాంతాలకు ఇంకా మాఫీ పెండింగ్‌లో ఉండనుంది. 1220 మంది కార్మికులకు రూ. 9.62 కోట్ల మాఫీ కావల్సి ఉంది. మరోవైపు కొందరికే మాఫీ చేయడంపై కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలు ఉన్న మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు విడుదల చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందరికీ ఒకే దఫాలో చేనేత రుణమాఫీ చేశారు. 2010 నుంచి 2017 మార్చి వరకు తీసుకున్న వ్యక్తిగత రుణాలు రూ. లక్ష వరకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంక్ నుంచి, జాతీయ బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలను కట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,014 మంది చేనేత కార్మికులకు సుమారు రూ. 7కోట్ల లబ్ధి చేకూర్చింది. ఆ తర్వాత చేనేత కార్మికులు మళ్లీ వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు.