మునుగోడు, సెప్టెంబర్ 22 : చేనేత కార్మికులకు రుణ మాఫీ వెంటనే చేయాలని చేనేత కార్మిక సంఘం మునుగోడు మండలాధ్యక్షుడు చెరుకు సైదులు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత రుణ మాఫీని ప్రభుత్వం గతేడాది ఆగస్టు 7న ప్రకటించింది. సంవత్సరం గడిచినా ఇంతవరకు ఏ ఒక్క కార్మికుడికి రుణ మాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల అకౌంట్లలో రుణ మాఫీ డబ్బులు జమ చేయాలన్నారు.
చేనేత వృత్తి నడవక అప్పుల పాలై కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేనేత భరోసాతో కార్మికుడికి రూ.18 వేలు, అనుబంధ కార్మికుడికి రూ.6 వేలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మిరియాల అశోక్, మండల కార్యదర్శి సింగం శివయ్య, మునుగోడు పట్టణ అధ్యక్షుడు చిలుకూరు మధు, కార్యదర్శి కర్నాటి రాజు, పలివెల కార్మిక సంఘం కార్యదర్శి చెరుపల్లి రాము, మాజీ అధ్యక్షుడు సింగం గిరి, సింగం వెంకటేశం పాల్గొన్నారు.