సూర్యాపేట టౌన్, అక్టోబర్ 4 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లు అభివృద్ధి పథంలో నడిపిందవరో, అభివృద్ధిని అటకెక్కించి అరాచాకాలకు పాల్పడుతున్నదెవరో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యత్వం కలిగిన రెండు కుటుంబాలకు రూ.2లక్షల బీమా చెక్కులు, మరొకరికి ఎల్ఓసీ, 103 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. కేసీఆర్‌ది నిర్మాణాత్మక ఆలోచన అయితే.. కాంగ్రెస్ పార్టీది కూలగొట్టే అరాచక పాలన అని తెలిపారు. ఆరు గ్యారంటీలంటే ఇల్లు ఇస్తారని ప్రజలు నమ్మి ఓటేస్తే ఉన్న ఇంటిని కూలగొడుతున్నారన్నారు. రైతు భరోసా లేదు, రైతుబంధు ఇస్తలేరని విమర్శించారు. హామీలను అమలు చేయలేక, అభివృద్ధి చేతగాక అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలు పట్టకపోగా కొత్త సమస్యలు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
కార్యకర్తలను కంటి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ భీమా కార్యకర్తల కుటుంబాలకు ఎంతో ధీమాను అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, ఆయా మండలాల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, తూడి నర్సింహారావు, దొంగరి యుగంధర్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.