రామగిరి/మిర్యాలగూడ/సూర్యాపేట/సూర్యాపేట టౌన్/కోదాడ టౌన్, నవంబర్ 17 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష నిర్వహించగా తొలిరోజు సగం మంది మాత్రమే అభ్యర్థులు హాజరయ్యారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడలో 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 28,353 మందికిగానూ పేపర్-1కు 15,459మంది, పేపర్-2కు 15,392 మంది హాజరయ్యారు.
ఉదయం కంటే మధ్యాహ్నం జరిగిన 2వ పేపర్‌కు చాలా మంది అభ్యర్థులు హాజరు కాలేదు. వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు రావడంతో బస్టాండ్లు కిటకిటలాడాయి. వాహనాల్లో రావడంతో రోడ్లు రద్దీగా మారాయి. కొంత మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా రావడం, పరుగులు తీయడం కనిపించింది. కొన్ని సెంటర్ల వద్ద ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులను లోపలికి అనుమతించకపోడంతో కన్నీటిపర్యంతమవుతూ వెనుతిరికారు. కొంత మంది మహిళా అభ్యర్థులు చంటి పిల్లలతో పరీక్ష కేంద్రాలకు రావడంతో వారితో వచ్చిన వారు ఆడిస్తూ కనిపించారు.
జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, పరీక్షల జిల్లా నోడల్ అధికారి జె.శ్రీనివాసు తనిఖీ చేశారు. పరీక్షలను ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ శరత్చంద్ర పవార్, ఏఎస్పీ రాములునాయక్ బందోబస్తు పర్యవేక్షించారు. టీజీపీఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జేఎన్టీయూ ప్రత్యేక పరిశీలకుడు విజయ్‌భాస్కర్, పరీక్షల రీజినల్ కో ఆర్డినేటర్స్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, పరీక్షల నియంత్రణాధికారి బి.నాగరాజుతోపాటు పలువురు అధికారులు కూడా పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. మిర్యాలగూడలో పరీక్షా కేంద్రాలను సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ పరిశీలించారు. తొలిరోజు ప్రశాంతంగా పరీక్షలు ముగియడంతో అధికారులు ఊరిపిల్చుకున్నారు.
సూర్యాపేట జిల్లాలో గ్రూప్ -3 తొలి రోజు నిర్వహించిన రెండు పరీక్షలకు 55.45 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశా రు. మొత్తం 16,543 మంది అభ్యర్థులకుగానూ పేపర్ -1కు 9,178 (55.48 శాతం) మంది హాజరవగా, 7,365 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2కు 9,173(55.45 శాతం) మంది హాజరుకాగా 7,320 మంది గైర్హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ పరిశీలించారు. ఎస్పీ వెంట సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ రవి, సిబ్బంది ఉన్నారు. కోదాడ పట్టణంలోని సనా ఇంజినీరింగ్ కళాశాలలో సరైన సమయానికి రాకపోవడంతో ఐదుగురు అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమంతించలేదు. ఇదే సమయంలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన అడిషనల్ కలెక్టర్ రాంబాబును సైతం ఆ అభ్యర్థులు ప్రాధేయపడినా పంపలేదు. దాంతో వారు కన్నీటి పర్యంతమైయ్యారు.
గ్రూప్ -3 పరీక్షల్లో భాగంగా ఆదివారం రెండు పేపర్లు ముగిశాయి. పేపర్ -3 సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30వరకు జరుగనుంది. దీంతో వీటికి సంబంధించి పరీక్షలు పూర్తిగా నేటితో ముగుస్తాయి.