నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యలు పరిష్కంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని డిమాం డ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జేఏసీ డిసెంబర్ 27, 28 తేదీల్లో టోకెన్ సమ్మె పిలుపులో నిరసన వ్యక్తం చేశారు.
నల్లగొండ, తిప్పర్తి, చిట్యాల, కేతేపల్లి, మునుగోడు, పెద్దవూర, హుజూర్నగర్, మేళ్లచెర్వు, మోతె, రామన్నపేట, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, ఆత్మకూర్.ఎం, భువనగిరి, బీబీనగర్ మండల కేంద్రాల్లో కార్మికులు ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, వేతనాలకు సెపరేట్ గ్రాంట్ ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా, ఈఎస్ఐ కల్పించాలని కార్మికులందరినీ పర్మినెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ. 5 లక్షలు ఇవ్వాలని కోరారు. అత్యధిక శ్రమ దోపిడీకి గురవుతున్న గ్రామ పంచాయతీ కార్మికలకు వేతనం రూ.26 వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ టోకెన్ సమ్మెతో సమస్యలు పరిష్కంచకపోతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.