మునుగోడు, ఏప్రిల్ 10 : ప్రచార ప్రకటనల కోసం మాత్రమే ప్రభుత్వం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గోనె సంచులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో ధాన్యం విక్రయించుకునేందుకు వచ్చిన రైతులు గోనె బస్తాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు నష్టం కలిగే విధంగా తేమ, తాలు పేరుతో మోసం చేయకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.
సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ అందించాలని కోరారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, తాగునీరుతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. వానకాలం ధాన్యానికి అందించాల్సిన బోనస్ నేటికీ రైతు ఖాతాల్లో జమ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. రైతులను ఇబ్బందులకు గురి చేసేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రవర్తిస్తే రైతులతోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు సాగర్ల మల్లేశ్, మండల కార్యదర్శి వేముల లింగస్వామి, ఉడుత లక్ష్మయ్య పాల్గొన్నారు.