యాదాద్రి భువనగిరి, మే 15 (నమస్తే తెలంగాణ) : అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు అష్టకష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల సేకరణను గాలికొదిలేసింది. వారాల కొద్దీ ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు సగం కూడా వడ్లను కొనుగోలు చేయలేదు. కాంటా వేసిన ధాన్యాన్ని తరలించడంలోనూ జాప్యం చేస్తున్నది. ఫలితంగా చేసేదేం లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తేనే ప్రభుత్వం దిగివస్తున్నది. జిల్లా వ్యాప్తంగా నిత్యం రెండు, మూడు చోట్ల ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఆందోళనలు చేపడుతున్నారు.
జిల్లాలో 2.93లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 5.25లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. పౌర సరఫరాల అధికారులు మాత్రం నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 323 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ధాన్యం కొనుగోళ్లు మాత్రం సజావుగా సాగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ పోసిన ధాన్యం కుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు.
జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలన్నర గడుస్తున్నా ఇంకా సగం ధాన్యం కూడా కొనలేదు. ఈ నెల 14వ తేదీ వరకు 22,552 రైతుల నుంచి 2,20,798 మాత్రమే కొనుగోలు చేశారు. అంటే లక్ష్యంలో సగం కూడా కొనుగోళ్లు జరుగలేదు. వీటిలో 2,09,886 మెట్రిక్ టన్నులు మిల్లులకు ధాన్యం తరలించగా, ఇంకా 10,912 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉంది. ఇక రైతులకు డబ్బుల చెల్లింపుల్లోనూ ఆలస్యం జరుగుతున్నది. రూ.484.96 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.300.23 కోట్లు మాత్రమే జమ చేశారు. ఇంకా రూ.184.73 కోట్లు రైతులకు చెల్లించాలి.
వడ్ల కొనుగోళ్ల జాప్యానికి అధికారులు అనేక కారణాలను చెబుతున్నారు. జిల్లాలోని ఉన్న 40 రైస్ మిల్లులన్నీ ధాన్యంతో నిండుగా ఉన్నాయి. గత యాసంగికి చెందిన 1.80లక్షల మెట్రిక్ టన్నులు, వానకాలం సీఎంఆర్ ఇంకా మిల్లుల్లోనే ఉండటంతోనే స్థలం కొరత ఏర్పడింది. అదే విధంగా ఎఫ్‌సీఐ గోదాముల్లో సీఎంఆర్ దించుకోవడంలోనూ జాప్యం జరుగుతున్నది. కొనుగోలు కేంద్రాలకు టార్ఫాలిన్లు సరిపోవడంలేదు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టడమే గగనంగా మారింది. ఇక మిల్లుల్లో హమాలీల కొరత ఉంది. కాంటా పెట్టిన వడ్ల సంచులను మిల్లులకు తీసుకెళ్లిన లారీలను అన్లోడ్ చేయడానికి హమాలీలు సరిపడాలేరు. వెళ్లిన లారీలు తిరిగి రావడానికి రోజుల సమయం పడుతున్నది.
జిల్లాలో రైతులు ప్రభుత్వ తీరుతో విసిగిపోయారు. వారాలు, నెలలు గడుస్తున్నా ధాన్యం కొంటలేరు. వర్షాలతో కేంద్రాల్లోనే ధాన్యం తడుస్తున్న పరిస్థితి. తడిసిన ధాన్యం కొంటామని చెబుతున్నా ఎక్కడా కొనడం లేదు. మంచి ధాన్యానికే కొర్రీలు పెట్టి కోతలు పెడుతున్నారు. బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు తరుగు తీస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బీ గ్రేడ్‌కు లెక్కగడుతున్నారు. దీంతో కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఇటీవల వివిధ మండలాల రైతులు ధర్నా చేపట్టారు. పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి రాశులుగా పోసి నిరసన తెలుపుతున్నారు. ఆందోళన చేస్తే అధికారులు వెంటనే స్పందించి సదరు కేంద్రాలను సందర్శించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. లేకుంటే మాత్రం అటు వైపు కూడా చూడటం లేదు. మరోవైపు ఆకాశంలో మబ్బులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల వర్షానికి ధాన్యం తడిసి అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
చౌటుప్పల్ మార్కెట్‌కు వడ్లు తెచ్చి నెల దగ్గరకు వస్తున్నది. మొన్నటి గాలివానకు తడిసినయి. నాలుగు రోజులు ఆరబెట్టిన. తెచ్చిన రెండు మూడు రోజులకు తూకం వేస్తే ఈ బాధలుండకపోవు. ప్రతిదినం పొద్దుగాళ్ల వచ్చి పొద్దుపోయోవరకు కుప్ప కాడనే ఉండాల్సి వస్తున్నది. చాలా బాధ అయితున్నది. ఇప్పటికైనా తూకం వేయాలి. లేకుంటే వచ్చే వానలకు మళ్లీ వడ్లు తడుస్తయి.
-తూర్పింటి పారిజాత, మహిళా రైతు, రాంనగర్, చౌటుప్పల్
చౌటుప్పల్ మార్కెట్లో వడ్లు పోసి 20రోజులు దాటింది. ఇప్పటివరకు మాయిశ్చర్ కూడా చూడలేదు. తూకం వేయడానికి ఎన్నిరోజులు పడుతుందో. ఇంతకుముందు కురిసిన వానలకు వడ్లు తడిసినయి. నాలుగు రోజులు ఆరబెట్టిన. రోజూ మార్కెట్‌కు వచ్చిపోవుడే సరిపోతున్నది. ఇతర వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నం. ఇంకో పది రోజులు అయితే రోహిణి కార్తె వస్తుంది. ఇలానే అయితే పనులు ఎట్లా చేసుకోవాలి. వాన కాలం నెత్తి మీదికి వచ్చినట్లే. ఏమి చేయాలో ఏమో. వడ్లు పండించడం కన్నా అమ్మడం పెద్ద కష్టంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వడ్లు తొందరగా కొనాలి.
-బొల్లమోని శంకరయ్య, తంగడపల్లి, చౌటుప్పల్
ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ధాన్యం కొనుగోళ్లు సరిగా జరిగేవి కాదు. రైతులకు మద్దతు ధర కూడా అంతంతమాత్రంగానే ఉండేది. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి అమ్ముకునేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతుల పరిస్థితి మెరుగైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలకు ఆదేశించారు. దాంతో పదేండ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగేది. అన్నదాత ఖాతాల్లో డబ్బులు కూడా ఎప్పటికప్పుడుఏ జమ అయ్యేవి. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక మళ్లీ సీన్ రివర్సయ్యింది. ధాన్యం సేకరణను గాలికొదిలేసింది.
మా గ్రామంలో బస్తాకు 500 గ్రాములు ఎకువ తూకం వేస్తున్నారు. షార్టేజ్ వస్తదని 500 గ్రాములు తూకం వేయడంతో రైతులపై భారం పడుతున్నది. కొనుగోలు కేంద్రంలో లారీ లోడ్ కాగానే మిల్లుల వద్ద వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి. రెండు మూడు రోజులు లారీల్లో ధాన్యం అలాగే ఉండడం వల్ల షార్టేజ్ వస్తుంది. 20 రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది.
-మేకల మల్లారెడ్డి, శివారెడ్డిగూడెం, భూదాన్‌పోచంపల్లి మండలం
మద్దతు ధరను ఆశించి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెస్తే నెలన్నర గడిచినా కొనుగోలు చేసే దిక్కు లేదు. తాలు చెత్త లేకుండా తూర్పార బట్టి, ఆరబెట్టి ధాన్యం కుప్పలు పోసి పెట్టినం. లారీల కొరత, మిల్లుల వద్ద దిగుమతి కావడం లేదని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రాశులకు తూకాలు చేయడం లేదు. సీరియల్ పేరిట నిర్వాహకులకు డబ్బులు ఇచ్చిన వారి ధాన్యం తూకాలు వేస్తున్నారు. ఇవ్వని రైతుల ధాన్యం రాశుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇదేమిటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారు. వానలు పడుతుండడంతో ధాన్యం తడుస్తుందని భయమేస్తున్నది.
– దొండ నర్సయ్య రైతు, సదర్శాపురం, మోత్కూరు మండలం