పెన్పహాడ్, నవంబర్ 18 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆర్డీఓ ఆర్.వేణు మాధవరావు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు ఎక్కువ ధాన్యంను తీసుకొస్తున్నందున మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వేగవంతంగా కాంటాలు వేసి త్వరత్వరగా మిల్లులకి ఎగుమతి చేయాలని నిర్వాహకులకు సూచించారు.
అనంతరం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ భారతి, సాదా బైనమా సమస్యలన్నింటిని త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించవద్దని, సమయ పాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ధరావత్ లాలునాయక్, సీనియర్ అసిస్టెంట్ రాధమ్మ, ఎమ్మారై రంజిత్ రెడ్డి, ఏఆర్ఐ అజీజా నిషా, పీఏసీఎస్ సిబ్బంది రవీందర్, వెంకన్న, వివిధ గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.