చండూరు, ఏప్రిల్ 12 : ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, ఆలస్యమైతే రైతులు ఇబ్బందులు పడుతారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో చండూరు మండలం అంగడిపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సెంటర్కు ఇప్పటివరకు దాదాపు 46 మంది రైతుల నుండి 8 వేల క్వింటాలు వచ్చాయని, గోనె సంచులు ఇంతవరకు రాలేదన్నారు. ఇంకా ధాన్యం రావాల్సి ఉందని కొనుగోలు చేయడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని, దీనివల్ల కాంట వేసే సమయంలో రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కొత్త గోనె సంచులు ఇవ్వాలని రైతులు కోరుతున్నట్లు చెప్పారు. తడిచిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు.
అంతేకాకుండా సన్న వడ్లకే కాకుండా దొడ్డు రకం వడ్లకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. అలాగే గతంలో బోనస్ జమకాని రైతులకు బోనస్ ఇవ్వాలన్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున రైతుల నుంచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి, పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున రైతులకు, హమాలీ కార్మికులకు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, కూర్చోవడానికి టెంట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, ఈరటి వెంకటయ్య, బెల్లం స్వామి, ఎఫ్ఎసిఎస్ సీఈఓ అమరేందర్ రెడ్డి, వ్యవసాయ అధికారి భార్గవి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.