యాదాద్రి భువనగిరి, మే 10 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేట్లు లేవు. నారు పోయడం మొద లు.. ఎరువులు, వాతావరణ పరిస్థితులు ఇలా అన్ని అంశాల్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లో వడ్లు అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. అనేక చోట్ల ధాన్యం కాంటా వేయడంలేదు. కాంటా వేసినా.. రవాణా చేయడంలేదు. ఇక కొన్న ధాన్యానికి డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సగం మందికి కూడా పేమెంట్ చేయకపోవడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొనుగోళ్లు 1,07,769 మెట్రిక్ టన్నులే..
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి సీజన్లో 3.14లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 7 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 4.5 లక్షల టన్నుల వడ్లు సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం 357 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా.. 335 సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా వాటిల్లో ధాన్యం కొనడంలేదు. ఇక ప్రారంభించిన అనేక కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేయడంలేదు. దీంతో రైతులు ధాన్యాన్ని రాశులుగా పోసి నిరీక్షిస్తున్నారు.
అన్ని సక్రమంగా ఉన్నా కాంటాలు వేయడంలేదు. ఒక్కో కేంద్రం వద్ద సుమారు వంద మంది రైతుల ధాన్యం నిలిచిపోయింది. మరి కొన్ని చోట్ల కాంటాలు వేసినా లారీల కొరతతో రవాణా చేయడంలేదు. మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు రావడంలేదు. మిల్లుకు వెళ్లినా ధాన్యం దిగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు, మూడు రోజులకోసారి లారీలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఒక్కో కేంద్రం వద్ద సుమారు 100 బస్తాల ధాన్యం రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 10,517 మంది రైతుల నుంచి 1,07,769 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. ఏప్రిల్‌లోనే 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నా, మే 10వ తేదీ దాటినా ఇంకా టార్గెట్ చేరుకోలేదు. మరోవైపు వర్షాలు, ఈదురుగాలులతో రైతులు టెన్షన్ పడుతున్నారు.
చెల్లింపుల్లో జాప్యం..
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆపసోపాలు పడుతున్న రైతులకు.. తీరా ధాన్యం అమ్మినా కూడా ప్రభుత్వం డబ్బులను సకాలంలో చెల్లించడంలేదు. జిల్లాలో సగం మందికి కూడా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయలేదు. రోజులు గడుస్తున్నా పేమెంట్ కాకపోవడంతో ఎదురుచూపులు తప్పడంలేదు. యాదాద్రిలో రూ. 256 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 5749 మందికి రూ. 118 కోట్లు మాత్రమే ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తంగా మరో 4768 మంది రైతులకు రూ. 138 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. ధాన్యం కొన్న 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా వారం దాటినా చెల్లింపుల్లేవు. ధాన్యం డబ్బులు ఖాతాల్లో వేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా.? లేదా అని తెలుసుకునేందుకు తరచుగా ఫోన్ మెసేజ్‌లు, ఏటీఎంలలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆన్లైన్ నమోదులో జాప్యం..
ధాన్యం కొనుగోళ్లు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో అన్నదాతకు అవస్థలు తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యం తూకం వివరాలు విధిగా ట్రక్‌షీట్‌లో నమోదుచేయాలి. ఆ తర్వాత ఆధార్‌కు లింక్ చేస్తే ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. నంబర్‌ను ఎంట్రీ చేశాక ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆ తర్వాత అధికారులు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. కానీ ఆన్లైన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 10,517 మంది రైతులకు గాను 6560 మందికి రూ. 128.85 కోట్ల ధాన్యాన్ని ఆన్లైన్ చేశారు. ఇంకా సగం మంది వివరాలు ఆన్లైన్ చేయాల్సి ఉంది.