సూర్యాపేట, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడు వారాల నుంచే రైతులు వరి కోతలు మొదలు పెట్టగా, ప్రభుత్వం మాత్రం తాపీగా నాలుగు రోజుల కిత్రమే కొనుగోళ్లను ప్రారంభించింది. జిల్లాలో 4,72,000 ఎకరాల్లో వరి సాగు కాగా.. 3,79, 000 ఎకరాల్లో సన్నాలు, 93 వేల ఎకరాల్లో దొడ్డు రకం సాగైనట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటివరకు సన్న రకాల కోతలు 35 శాతం పూర్తి కాగా, దొడ్డు రకం సాగానికిపైగా పూర్తయ్యాయి. కానీ, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలిస్తే సర్కారు తీరు తేటతెల్లమవుతున్నది. దొడ్డు రకం ధాన్యాన్ని ఇప్పటివరకు 6,532 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. సన్నాలను అసలు కొన్నదే లేకపోవడం గమనార్హం.
ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలను మొదట్లో ప్రారంభించకపోవడంతో రైతులు నేరుగా రైస్ మిల్లుల్లో విక్రయించారు. పైగా, 17శాతం తేమ కొర్రీతో ఇప్పటికీ మిల్లులకే తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బోనస్ సంగతి దేవుడెరుగు.. సన్న ధాన్యం తీసుకెళ్లి ఐకేపీ కేంద్రాల్లో పోస్తే ధాన్యం రంగు మారుతుందని, 17శాతం తేమ వచ్చే వరకు ఎండబెడితే తూకం తగ్గుతుందని రైతు లు వాపోతున్నారు. దాంతో పచ్చి వడ్లనే ఎంతోకొంత ధరకు మిల్లలకు విక్రయిస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో పది నుంచి పదిహేను రోజులపాటు ఉన్న ధాన్యం రంగు మారడంతో మిల్లర్లు దిగుమతి చేసుకోకపోవడంతో అధికారుల పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.
తాజాగా శుక్రవారం అర్థరాత్రి దాటేంత వరకూ మిల్లర్లతో చర్చలు జరిపి ఎట్టకేలకు దిగుమతి చేయించారు. గతంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో మాత్రమే అత్యధికంగా సన్నరకం వడ్లు సాగు చేశారు. కాళేశ్వరం నుంచి జలాలు సూర్యాపేట జిల్లాకు రావ డం మొదలైనప్పటి నుంచి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోనూ సన్నాల సాగు పెరిగిం ది. జిల్లాలో 4,72,000 ఎకరాల్లో వరి సాగు కా గా, ఇందులో 3,79,000 ఎకరాల్లో సన్నాలే సాగు చేయడం విశేషం. కానీ, ఇప్పటివరకూ సన్నరకం ధాన్యం ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొన్న దాఖలాలు లేవు. దొడ్డు రకం కూడా కేవలం 6,532 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.