నాంపల్లి ఏప్రిల్ 28: అధికారుల నిర్లక్ష్యంతో దేశానికి అన్నం పెట్టే రైతన్న తాను పడించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. గత వారం పడిన వడగండ్ల వానతో తడిసిన ధాన్యం..అధికారులు కొనుగోలు చేయకముందే మళ్లీ వర్షం కురవడంతో రైతులను నిండా ముం చింది. నాంపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మంగళవారం వర్షం పడటంతో వడ్లు వర్షంలో కొట్టుకుపోయాయి. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి.
అప్పు చేసి ఇంటిల్లిపాది ఎండకు ఎండి పండించిన పంట వర్షానికి కొట్టుకుపొతున్నా కాపాడుకోలేని స్థితిలో రైతు ఉన్నా డు. ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చినా అధికారులు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. తేమ, లారీ కొరత పేరుతో కొనుగోలు చేయని అధికారులు బాధ్యత వహించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

చందంపేట(దేవరకొండ), ఏప్రిల్ 28 : దేవరకొండలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో పట్టణవాసులు సేదతీరారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షంతో వాతావరణం చల్లబడడంతో జనం నంతోషం వ్యక్తం చేశారు.

ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 28: మండల కేంద్రంతో పాటు, కొరటికల్, మురిపిరాల, పల్లెపహాడ్, పారుపల్లి, సింగారం, రాయిపెల్లి గ్రామాల్లో వడగండ్లతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంతమేరకు తడిసింది. పల్లెపాడులో భారీ వడగండ్ల వానతో సుమారు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.
గుండాల, ఏప్రిల్ 28: అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. బ్రాహ్మణపల్లి, సుద్దాల గ్రామాల్లో వడగళ్ళతో కూడిన వర్షం కురవడంతో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.