పెన్పహాడ్, ఏప్రిల్ 26 : పెన్పహాడ్ మండలంలో ఈ యాసంగిలో 33 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది గతానికి భిన్నంగా వరి పంటలకు చీడ పీడల దాడి ఎక్కువగా ఉండడంతో తాము వేసిన పంటను రక్షించుకునేందుకు రైతన్న నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎన్నో కష్ట నష్టాలకోర్చి పండించిన ధాన్యా న్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యా న్ని తెచ్చిన రైతన్నకు అక్కడ భంగపాటు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తరువాత తాము పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేం ద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని విక్రయించడం తలకు మిం చిన భారంగా మారుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తేమ, తాలు పేరిట ఇబ్బందులకు గురి చేసిన నిర్వాహకులు ప్రస్తుతం ధాన్యం తూకంలో జాప్యం చేయడంతో ఎక్కడ పోసిన ధాన్యపు రాశులు అక్కడే ఉన్నాయి. ఒక్కో కొనుగోలు కేంద్రంలో రోజుకు నాలుగు లారీలకు సరిపడా ధా న్యాన్ని తూకం వేస్తే కానీ త్వరగా అయిపోని పరిస్థితి నెలకొంది. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులు పర్యవేక్షణ కొరవడింది. తాలు పేరిట ఇబ్బందులు పెడుతున్నారని తరుగు పేరుతో బస్తాకు అదనంగా రెండు నుంచి రెండున్నర కిలోల ధాన్యం తీసి, తూకం వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో పలు చోట్ల ఆందోళనలు సైతం చోటు చేసుకున్నాయి.
పేరుకుపోతున్న ధాన్యం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్ప లు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అత్యధక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ధాన్యంలో తేమ సమస్య ఉండదు. ధాన్యం ఆరబెట్టిన ఒకటి రెండు రోజుల్లో నిబంధన ప్రకారం ఉండాల్సిన 17శాతం తేమ కంటే తక్కువనే ఉంటుంది. అయినా సెంటర్ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చేతికి అందిన ధాన్యం ఒక్క వర్షం పడితే తడిసి ముద్దవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు భగభగమనే ఎండలో ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతన్నకు సాయంత్రం ఆకాశంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అనుకున్న సమయానికి కొనుగోళ్లు పూర్తి చేస్తారా లేరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జూన్ మొదటి వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.