ఊర పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరం జనసంద్రమైంది. ఆదివారం ఊర పండుగను ఘనంగా జరుపుకొన్నారు. పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఊర పండుగలో ప్రధానమైన పదార్థం సరిని నగరవాసులు తమ ఇండ్లపై, పొలాల్లో ఎంతో భక్తిప్రపత్తులతో చల్లుకున్నారు.
అమ్మవారి తొట్లెలు, బండారి సమర్పణలు, గుగ్గిలం పొగలు, కల్లు సాకలు, యాటల బలులు, డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల పూనకాలు, భవిష్యవాణి.. ఇలా జిల్లాకేంద్రంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించింది. ఖిల్లా రఘునాథ్ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె (తేలు మైసమ్మ గద్దె) వద్ద గ్రామ దేవతలను ప్రతిష్ఠించారు. దేవతామూర్తుల ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొనగా, సరిని దక్కించుకోవడం కోసం పోటీపడ్డారు.