సూర్యాపేట, నవంబర్ 21: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. తొలి రోజే 40,798 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ రైతులకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా మార్కెట్లో అమ్మడానికే మొగ్గు చూపుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో రోజుల తరబడి నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని, అందుకే వ్యవసాయ మార్కెట్‌కు ఉదయం వస్తే సాయంత్రానికి డబ్బులతో వెళ్లొచ్చని పలువురు రైతులు పేర్కొన్నారు. ఇక రైతుల అమాయకత్వాన్ని, అత్యధికంగా ధాన్యం రాకను గుర్తించిన ట్రేడర్స్, కమీషన్‌దారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఏగ్రేడ్ ధాన్యానికి రూ.2,389, బీగ్రేడ్ ధాన్యానికి రూ.2,369 మద్దతు ధర ఇస్తుంటే మార్కెట్లో మాత్రం తక్కువకే కొనుగోలు చేస్తున్నారు.
వందమంది రైతుల్లో ఒకరికి మాత్రమే మద్దతు ధర ఇస్తూ అదే ఎక్కువ ధరగా చూపుతున్నారు తప్ప మెజార్టీ రైతులకు మద్దతు ధర కంటే చాలా తక్కువ చెల్లిస్తున్నారు. సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు 758 మంది రైతులు 40,798 బస్తాల ధాన్యం తీసుకొచ్చారు. పాడి బీపీటీ క్వింటాల్‌కు రూ.1,559, పాడి బీపీటీ పాతవి క్వింటాల్‌కు రూ.2,011, జైశ్రీరాం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,611, పాడి ఐఆర్ క్వింటాల్‌కు రూ.1,626, పాడి హెచ్ఎంటీ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,719, ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్‌కు రూ.1,911 ధర పలికాయి.
ఇవి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువే అయినా తేమ, తాలు కారణాలు చూపుతూ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఐకేపీ కేంద్రాల్లో సరైన వసతులు లేక మార్కెట్‌కు తెస్తున్న ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేలా, కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చేలా పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు.
మద్దతు ధర అందించేందుకు కృషి
ఎంతో ఆశతో సూర్యాపేట మార్కెట్‌కు ధాన్యాన్ని తీసుకొస్తున్న రైతులకు మంచి ధర అందించేందుకు కృషి చేస్తున్నామని మార్కెట్ కమిటీ సెక్రటరీ ఎండీ ఫసీయొద్దీన్ చెప్పారు. శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ట్రేడర్స్‌తో మాట్లాడారు. ధాన్యానికి మంచి ధర నిర్ణయించాలని సూచించారు. కోసిన వెంటనే కాకుండా ఆరబెట్టుకొని తేమ, తాలు లేకుండా తీసుకొస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుందన్నారు.