రామన్నపేట, అక్టోబర్ 15 : వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి రైతులకు వెంటనే టార్పాలిన్లు అందజేసి, కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా రైతులకు కావాల్సిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నట్లు దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రికి రాజకీయాలు తప్పా రైతుల బాధలు పట్టవన్నారు. కేసీఆర్ పాలనలో సీజన్ మొదలయ్యేకంటే ముందే కావాల్సిన వనరులు సమకూర్చేవాళ్లమని తెలిపారు. అధికారులు, మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లలో లోపాలు లేకుండా చూసేవారమని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల కమీషన్ల పేరుతో మిల్లర్లు, రైతుల నుండి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ముడుపులు ముడితే చాలు అన్నచందంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ప్రభుత్వం రూ.2,300 మద్దతు ధర ఇస్తే మిల్లర్లు మాత్రం రైతులకు రూ.1,500 ఇస్తున్నా మిల్లర్లను ఎందుకు ప్రభుత్వం హెచ్చరించడం లేదని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వేమవరం సుధీర్ బాబు, గోరిగే నరసింహ, జిల్లా నాయకులు బదుల రమేశ్, ఎస్కే.చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, నాయకులు మిరియాల మల్లేశం, బొడ్డు అల్లయ్య, లవణం రాము, గర్దాస్ విక్రమ్, రాస వెంకటేశ్వర్లు, ఆవుల శ్రీధర్, బుర్ర శ్రీశైలం, లవణం ఉపేందర్, ఎండీ ఎజాజ్, నల్ల సైదులు, ఎండీ అంజద్ పాల్గొన్నారు.