మునుగోడు, ఏప్రిల్ 23 : బడిబాట ముందుస్తు కార్యక్రమంలో భాగంగా మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించండి-ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారం తగ్గించుకోండి అనే నినాదంతో మునుగోడు మండలం పలివెల గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మన గ్రామంలోనే సకల సౌకర్యాలతో ప్రభుత్వ బడి ఉండగా, అనేకమందికి ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని, గ్రామస్తులంతా ఒకటై కట్టడి చేయాలన్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో 50 మంది విద్యార్థులకు సైకిల్స్ ఇప్పిచ్చినట్లు తెలిపారు. రవాణా సదుపాయం కింద 80 మంది విద్యార్థులకు ఒక్కొక్కరి రూ.4,800 ప్రభుత్వం నుంచి ఇప్పించినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి విద్యార్థి రూ.6 వేలు ఇప్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులను సత్ప్రవర్తనలో నడిపించడానికి పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాలలో దాదాపు 30 కంప్యూటర్లు ఉన్నాయని, విద్యార్థులకు కంప్యూటర్ విద్య కూడా నేర్పుతున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి స్క్రీమ్ లో భాగంగా విద్యార్థులకు చారిత్రక ప్రదేశాలను చూపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పెరిక నరసింహ, ఉయ్యాల యాదయ్య, విలియం రాజు, గేర నరసింహ, వెంకన్న, రాఘవేంద్ర, అంజిలమ్మ, కవిత, సావిత్రి, విద్యార్థులు పాల్గొన్నారు.