నల్లగొండ సిటీ, ఏప్రిల్ 22 : టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ బస్ డిపో వద్ద సమ్మెకు మద్దతు తెలుపుతూ కార్మికులను ఉద్దేశించి నెల్లికంటి సత్యం మాట్లాడారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని తెలిపారు.
ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కోసం ఇవ్వరాదని స్పష్టం చేశారు. అద్దె బస్సులను, అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసి గతంలో మాదిరిగా జాతీయం చేయాలని కోరారు. ఆర్టీసీ రక్షణ కోసం, కార్మికుల సమస్యల సాధన కోసం చేపట్టిన ఈ సమ్మెను ప్రభుత్వం జటిలం కాకుండా చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయడంతో పాటు 2025 వేతన సవరణను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతినెల రూ.400 కోట్లు ఆర్టీసీకి విడుదల చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి బెడ్ విన్నర్ పోస్టులను శాశ్వత ఉద్యోగాల కింద భర్తీ చేయాలని అన్నారు. ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించి కండక్టర్లు, డ్రైవర్లపై కెఎంపిఎల్, ఈ పి కె వేధింపులు నిలిపివేయాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ సిబ్బందిపై బలవంతపు బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని, 2019 సమ్మె సమయంలో నమోదైన పోలీసు కేసులను ఎత్తివేయాలన్నారు.
మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచి అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలని, రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యతతో ఈ సమ్మె జయప్రదం కావాలని, సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కె ఎస్ రెడ్డి, ఆర్ టి సి రాష్ట్ర జేఏసీ నాయకులు బి.నరేందర్, యార చంద్రయ్య, జిల్లా నాయకులు ఎన్ ఆర్ సి రాజు, టిజె రావు, డిపో నాయకులు ఏ ఎల్ స్వామి, బి.శంకరమ్మ, శ్రీను, కార్మికులు పాల్గొన్నారు.