తుంగతుర్తి, మే 29 : తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలుగా అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేసే విధంగా కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కేశవరావు కమిటీ ఏర్పాటు చేయడం, అమరుల కుటుంబాలను గుర్తించి గౌరవించడం, జైలుకు పోయిన వారిని గుర్తించడం, ఎఫ్ఐఆర్ నవోదయ నిర్బంధానికి గురైన వారిని గుర్తించడం, తెలంగాణ ఉద్యమంలో వివిధ దశల్లో పోరాటం చేసిన వారు గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఉద్యమకారులను గుర్తించి వారికి గుర్తింపు వచ్చే విధంగా న్యాయం చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రకటించిన హామీలను అమలు చేయాలన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశానికి ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అసువులు బాసిన అమరవీరులకు అలాగే తుంగతుర్తి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇటీవల మృతి చెందిన ఉద్యమకారుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఓరుగంటి సత్యనారాయణను స్మరిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పోలవరపు సంతోష్, ఎండీ నసీరుద్దీన్, శంకరమంచి రవీందర్ శర్మ, దుద్యాల రవీందర్రావు, ఎండీ.జానీ, గునిగంటి సంతోష్ గౌడ్, తడకమళ్ల రవికుమార్, బానోతు వెంకన్న, బెడద రాములు, గౌడిచర్ల రాఘవులు, ఓరుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.