టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను ఈ నెల 15న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలో గతంలో తక్కువ మార్కులు వచ్చిన వారితోపాటు కొత్తవారికి అవకాశం కల్పించేలా ప్రభుత్వం టెట్‌ను నిర్వహిస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 187 పరీక్ష కేంద్రాలు కేటాయించగా 43,681మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులకు దూరం వెళ్లే ఇబ్బంది లేకుండా జిల్లా కేంద్రంతోపాటు డివిజన్, మున్సిపాలిటీ కేంద్రాల్లోనూ ఎగ్జామ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేపర్-1 ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగనున్నది.
– రామగిరి, సెప్టెంబర్ 11
రామగిరి, సెప్టెంబర్ 11: Government schoolలో ఉపాధ్యాయ పోస్టు భర్తీకి తొలిమెట్టు టెట్. దీని నిర్వహణ ఈనెల 15న జరుగనుండగా అందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. పరీక్ష విధుల్లో ఎలాంటి తప్పులు జరుగకుండా ఉండేందుకు రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇతర శాఖ అధికారులను, సిబ్బందిని ఇప్పటికే నియమించి ఉత్తర్వులు అందజేశారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ టెట్ రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్-1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగనుంది. అయితే ఈ పరీక్ష నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగదని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది.
టెట్‌కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంతో పాటు డివిజన్ కేంద్రాలు, మున్సిపాలిటీలో 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో జిల్లా వారీగా ఇలా…
నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, హలియా, దేవరకొండ, చండూరు, చిట్యాలల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. పేపర్-1కు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పేపర్ -2కు 49పరీక్ష ఏర్పాటు చేశారు.
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈప్రాంతాల్లో పేపర్-1కు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పేపర్ -2కు 29 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరిలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈప్రాంతాల్లో పేపర్-1కు జిల్లాకేంద్రంలోనే ఆయా ప్రాంతాల్లో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పేపర్ -2కు 13 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.
నల్లగొండ జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇలా..
నల్లగొండ జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ పర్యాయం జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మిర్యాలగూడలో 26, దేవరకొండలో 11, చండూర్లో 4, హలియాలో 5, చిట్యాలలో 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విధుల్లో ఇతర శాఖల సిబ్బంది
టెట్ పరీక్షకు విద్యాశాఖకు (టీచర్లు, ఇతర అధికారులు)చెందని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని వినియోగించడం లేదు. పరీక్ష విధుల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, వివిధ శాఖ అధికారులు, సిబ్బందిని వినియోగిస్తు ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్టుమెంటల్ అధికారులు, రూల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లకు ఉత్తర్వులను జారీ చేశారు. డిపార్టుమెంట్ ఆఫీసర్‌గా గెజిటెడ్
హెడ్మస్టర్లును నియమించారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 580 మంది, సూర్యాపేట జిల్లా 321మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 152 సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు, పరిశీలకులు, హాల్ సూపరింటెండెంట్లు నలుగురి నుంచి అయిదుగురి వరకు విధులు నిర్వహించనున్నారు. అయితే ప్రతి పరీక్ష కేంద్రానికి డిపార్టుమెంటల్ అధికారులు మాత్రమే విద్యాశాఖకు చెందిన సీనియర్ గెజిటెడ్ హెడ్మాస్టర్లు ఉంటారు. మిగిలిన వారు అంతా ఇతర శాఖలకు చెందినవారే.
నల్లగొండ జిల్లాలో టెట్‌కు సంబంధించి సమాచారం, సమస్యలుంటే డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లు 7989819053, 9246772723 లో సంపద్రించవచ్చు.
సూర్యాపేట: జిల్లాలో ఈనెల 15న జరిగే టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని టెట్ పరీక్ష నిర్వహణపై అదనపు కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, ఎ.వెంకట్‌రెడ్డిలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లా వ్యాప్తంగా పేపర్-1 పరీక్ష కోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 30 పరీక్ష కేంద్రాల్లో 7200, కోదాడలో 1 పరీక్ష కేంద్రంలో 197 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా 7397 మంది పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణ కోసం ఆరు రూట్లును ఏర్పాటు చేసినట్లు, 31 మంది చీఫ్ సూపరింటెం డెంట్లు, 123 మంది హాల్ సూపరిండెంట్లు, 309 మంది ఇన్విజలెటర్స్లను నియమించామన్నారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, డీఈఓ అశోక్, డీఎస్పీ రవి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
టీఎస్ టెట్-2023కు సర్వం సిద్ధం చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడంతోపాటు పటిష్టమైన నిఘా ఉంటుంది. అభ్యర్థులు కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష విధుల్లో ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నందున వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. అన్ని శాఖల అధికారులు సమన్వయ, సహకారంతో పనిచేస్తున్నాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ.