పెన్పహాడ్, సెప్టెంబర్ 01 : అక్రమ అరెస్ట్ లతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని ఆశ వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెన్పహాడ్లో ఆశ వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు నకిరేకంటి కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం కానున్నట్లు హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనలో పాల్గొనేందుకు వెళ్లే ఆశ వర్కర్లను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీస్ స్టేషన్లో నిర్బంధంలో ఉంచడం సమంజసం కాదన్నారు. నిరసన ప్రజాస్వామ్య హక్కు అన్నారు. హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆశ వర్కర్లను ఎంత అణచివేయాలని ప్రయత్నిస్తే అంత ఉవ్వెత్తున ఎగసి పడుతారన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో లకపక జ్యోతి. మతంగి రజిత. మామిడి శ్రీలత. షేక్ జంగిర్ భేగం. సీహెచ్ రమణ. ఎన్.రేణుక. నాగమ్మ. టి.ఇందిరా. పద్మ. అలివేలు ఉన్నారు.