యాదగిరిగుట్ట, ఆగస్టు 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తరించారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వామివారి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంగౌడ్‌తో కలిసి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్ట కొండపైన వీవీఐపీ అతిధి గృహం వద్దకు చేరుకున్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ హనుంతరావు, కలెక్టర్ హనుమంత్ కే జండగే, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ భాస్కర్‌రావు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అతిధి గృహం వద్ద గవర్నర్ పోలీసుల గౌరవ వదనం స్వీకరించారు. వీవీఐపీ అతిధి గృహంలోకి వెళ్లి ఆలయ సంప్రదాయ వస్ర్తాలను ధరించారు.
పర్యాటక శాఖకు చెందిన బ్యాటరీ వాహనంపై కొండపైన బస్టాండ్ ప్రాంగణం గుండా విష్ణు పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడే స్నాన సంకల్పంలో పాల్గొన్నారు. బ్యాటరీ వాహనంపై కొండపైన మాఢవీధుల్లో గల అఖండ దీపారాధన వద్దకు చేరుకుని పూజలు చేశారు. స్వామివారికి కొబ్బరికాయను సమర్పించారు. వాయిద్యాలు, మేళతాళాల మధ్య తూర్పు రాజగోపురంలోకి ప్రవేశించి త్రితల రాజగోపురం గుండా ముఖ మండపంలోకి వెళ్లారు.
ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, వేద పండితులు గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లే మార్గంలో గల క్షేత్ర పాలకుడి ఆలయం వద్ద అర్చకులు స్వామివారి హారతిని ఇచ్చారు. ముఖ మండపంలోని ధ్వజస్తంభానికి గవర్నర్ మొక్కారు. స్వామివారి గర్భగుడిలోకి వెళ్లి స్వయంభూమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 నామాలతో అష్టోత్తర పూజలు జరిపారు. సుమారు 9 నిమిషాల పాటు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆండాళ్ అమ్మవారిని, ఆళ్వారులకు నమస్కరించుకున్నారు. ముఖ మండపంలో ఉత్తరం అభిముఖంగా గవర్నర్‌ను కూర్చొబెట్టి ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు, అర్చక బృందం చతుర్వేద ఆశీర్వచనం అందించారు. దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్ హనుంతరావు వీఐపీ శాలువాతో సన్మానించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి స్వామివారి మహాప్రసాదాన్ని అందజేశారు.
ఈఓ భాస్కర్‌రావు రాగితో తయారు చేసిన స్వామివారి ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా పశ్చిమ రాజగోపురం వద్ద మీడియాతో గవర్నర్ మాట్లాడారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ శైలి తనను ఎంతగానో ఆకట్టుకున్నదని కితాబునిచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోవడం తన జీవిత కాలపు అనుభవంగా గుర్తుండిపోతుందన్నారు. త్వరలో మరోసారి స్వామివారిని దర్శించుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
పశ్చిమ రాజగోపురం వద్ద నుంచి లిఫ్ట్ వరకు బ్యాటరీ వాహనంలో వచ్చి లిఫ్ట్ గుండా వీవీఐపీ విడిదికి వచ్చారు. అక్కడే దేవస్థానం ఆధ్వర్యంలో అల్పాహరంలో భాగంగా పులిహోర, దద్దోజనం, కట్టెపొంగలి, సీరను స్వీకరించారు. పోలీసులు గౌరవ వందనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో ఆలయ డీసీపీ రాజేశ్ చంద్ర, ఏఈవోలు జూశెట్టి కృష్ణ, రఘు, ఏసీపీ రమేశ్‌కుమార్, సీఐ రమేశ్ పాల్గొన్నారు.
సందర్శకుల పుస్తకంలో..
స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని రాశారు. ఆలయ సందర్శన వల్ల పూర్తి ఆధ్యాత్మిక అనుభూతి చెందానని, దేశంలోనే ప్రముఖ ఆలయంగా ఆధ్యాత్మికతను సంతరించుకున్నదని పేర్కొన్నారు. ఆలయ నిర్వహణ తీరు ప్రశంసనీయమని లిఖించారు.