మఠంపల్లి, జనవరి 23 : వ్యవసాయం ఒక విజ్ఞానమని, ఇప్పటి వరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్‌గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆల య అర్చకులు, వేద పండితులు, అధికారులు గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు. ఆలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మా ట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హుజూర్నగర్ సమీపంలోని మగ్దూంనగర్ వద్ద 100 ఎకరాల్లో రూ.150కోట్ల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేశారు. అంతేగాక కోదాడ సమీపంలో రూ.50కోట్లతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన , లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.కోటి తో నిర్మించనున్న యాత్రికాసదన్, నూతన కిచెన్ షెడ్, మరో కోటితో నిర్మించే డార్మెటరీ బిల్డింగ్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషమన్నారు.
వ్యవసాయం ఒక విజ్ఞానమని ఇంతకు పూర్వం దేశంలో జై జవాన్, జై కిసాన్ నినాదం ఉండేదని ఆ తర్వాత జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం వచ్చిందని ప్రస్తుతం ఇది జై జవన్, జై కిసాన్ జై విజ్ఞాన్, జై అనుసంధాన్‌గా మారిందని తెలిపారు. మట్టపల్లిలో స్వయం భూ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉం డడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. జిల్లాలో పెద్దఎత్తున వ్యవసాయం సాగు చేయడం, ప్రత్యేకించి పామాయిల్ పెంపకం చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం రైతులకు రూ.2.47కోట్లు విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాల ప్రొసీడింగ్స్ అందజేశారు. అంతేగాక స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.504కోట్లు, ఆదాయ వనరులను పెంపొందించేందుకు మరో రూ.89 కోట్ల చెక్కులను అందజేశారు. కార్యక్రమం లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి, సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చైన్స్లర్ అల్తాఫ్ జానయ్య, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, పార్లమెంట్ సభ్యులు కుం దూరు రఘువీర్‌రెడ్డి, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, జిల్లా ఎస్పీ నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ మంగా రాథోడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.