రామగిరి, ఫిబ్రవరి 2 : ప్రభుత్వ విద్యాలయాల్లో సుదీర్ఘకాలం పనిచేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, రిటైర్మెంట్ అయ్యి ఏడాది గడిచినా బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఉపాధ్యాయ, అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు సిలిగిరి రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కట్టబత్తుల గణేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండలోని పీఆర్టీయూ భవనంలో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగికి వచ్చే బెనిఫిట్స్‌ను తక్షణమే అందించి పంపించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని అన్నారు. ఏడాదిగా బెనిఫిట్స్ రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ విషయంపై సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా వారిలో చలనం లేదని బాధపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బెనిఫిట్స్ వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కె.వెంకట్‌రెడ్డి, మహమ్మద్ ముస్తఫా, అలీఖాన్, ఇంద్రసేనారెడ్డి, బి.ప్రతాప్‌రెడ్డి, వందనం వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.