నందికొండ, జూన్ 8 : నందికొండలో నిర్మించిన బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో బౌద్ధ క్షేత్రంగా అగ్రస్థానంలో నిలుస్తుందని, ఆ దిశగా అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నందికొండ హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. మొదట హిల్‌కాలనీలోని విజయవిహార్‌కు చేరుకున్న మంత్రికి పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం ఉపేందర్‌రెడ్డి, టూరిజం హోటల్స్ జీఎం నాథన్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం బుద్ధవనంలో ఎంట్రన్స్ ప్లాజా, అశోకచక్రం, బుద్ధచరిత వనం, మహాస్తూపం, వ్యూ పాయింట్, ధ్యానమందిరాన్ని సందర్శించారు. బుద్ధవనంలోని ఆచా ర్య నాగార్జునుడు, బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ధ్యాన మందిరంలో బుద్ధవనం సం బంధించిన ఏరియల్ వ్యూ, లైటింగ్ షో, నిర్మాణాల వీడియోలను తిలకించారు.
ధ్యాన మందిరంలో ధ్యానం చేసి అధికారులతో బుద్ధవనం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బుద్ధుడి జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా బుద్ధవనం నిర్మాణం జరిగిందని, ఇంకా అభివృద్ధి పనులు చేపట్టవలసి ఉన్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యావత్ ప్రపంచానికి మార్గదర్శకమైన బౌద్ధ వారసత్వ, సంస్కృతిని అందరికీ చాటిచెప్పవలసిన ఆవశ్యకత ఉన్నదన్నారు. నందికొండలో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చడంతోపాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పా రు. అంతకు ముందు బుద్ధవనం ఓఎస్డీ సుధాన్‌రెడ్డి, బౌద్ధ విశ్లేషకుడు ఈమని శివనాగిరెడ్డి బుద్ధవనంలో మంత్రికి స్వాగంతం పలికారు. ఆయన వెంట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, బుద్ధవనం సిబ్బంది ఉన్నారు.