మిర్యాలగూడ, ఆగస్టు 11: రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న దున్నపోతుల గండి లిఫ్ట్ పనులను శనివారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌పాటి, ఎన్ఎస్పీ చీఫ్ ఇంజినీర్ అనిల్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
పనుల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని దున్నపోతులగండి, బొత్తలపాలెం- వాడపల్లి, తోపుచర్ల, వీర్లపాలెం లిఫ్టు ఇరిగేషన్ పనులు కొనసాగుతున్నాయని, దున్నపోతులగండి పథకానికి రూ.219.19కోట్లు, బొత్తలపాలెం పథకానికి రూ.259.25కోట్లు, వీర్లపాలెం-2 ఎత్తిపోతల పథకానికి రూ.32.22కోట్లు, తోపుచర్ల ఎత్తిపోతల పథకానికి రూ.9.30కోట్లు, దామరచర్ల మండలం కేశవాపురం ఎత్తిపోతల పథకానికి రూ.75.93కోట్లను మొత్తం రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
పనులను సంవత్సరకాలంలోపు పూర్తి చేయాలని చెప్పారు. దీనికి అవసరమైన నిధులు, పరికరాలను, భూసేకరణ పూర్తయ్యేలా సహకారం అందిస్తామన్నారు. వచ్చే ఆగస్టు 15న నాటికి ఈ ఐదు లిఫ్టులను ప్రారంభిస్తామన్నారు. దీనికి అవసరమైన చర్యలన్ని అధికారులు చేపట్టాలని, భూసేరకరణలో రైతులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మూడు చెక్‌డ్యాంలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం
డిండి : డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సారునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిండి మండల కేంద్రంలో ఆదివారం పలు ప్రాజెక్టులపై ఆయన మునుగోడు, దేవరకొండ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్‌తో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటా 6లక్షల ఎకరాల చొప్పున ఐదేండ్లలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్నారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని అత్యంత వెనుకబడిన, ఫ్లోరైడ్ ప్రాంతమైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో సుమారు మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.460 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి క్యాబినెట్ ముందుకు ఉంచామన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో మంజూరైన అంబాభవాని, కంబాలపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీరింగ్ చీఫ్ అనిల్‌కుమార్, కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఈఈ నాగేశ్వర్రావు, శ్రీధర్‌రావు, సీఈ నాగేశ్వర్రావు, ఎస్ఈ వెంకటేశ్వర్రావు, డీఈలు ప్రభాకర్, మనోహర్, శ్రీనివాస్, కృష్ణయ్య, ఆర్డీఓలు శ్రీనివాస్‌రావు, శ్రీరాములు, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, నాయకులు యాదన్నకుమార్, సత్యనారాయణ, యలమంద, రాములు, ఆనందరావు, స్కైలాబ్‌నాయక్, పొదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, గాయం ఉపేందర్‌రెడ్డి, ఎన్ఎస్పీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.