మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక ప్రగతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది. వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొని వారి కాళ్లపై వారు నిలబడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తున్నది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల, చేతివృత్తుల ఉత్పుత్తులకు మార్కెటింగ్ పెంచాలనే ఉద్దేశంతో కలెక్టరేట్ ప్రాగణంలో స్వయం ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మన ఉత్పత్తులు-మన గౌరవం పేరుతో నిర్మించిన ఈ భవనంలో గ్రామీణ ప్రాంత మహిళా సంఘాల సభ్యులు, రైతులు, చిన్నతరహా పరిశ్రమలు స్వతహాగా తయారు చేసుకునే వస్తువులను విక్రయించేందుకు వెసులుబాటు కల్పించారు. భవనాన్ని సోమవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
– భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 23
హరిత రహదారి
హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మండు వేసవిలో ప్రయాణికులకు చల్లని నీడనిస్తున్నాయి. ఆత్మకూర్ (ఎం) మండలంలోని మొరిపిరాల నుంచి చిన్నగూడెం వెళ్లే ప్రధాన దారి వెంట నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. రహదారిని కమ్మేసిన చెట్లు వాహనదారులు, ప్రయాణికులకు చల్లదనాన్నిస్తున్నాయి.
-ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 23
రూ.20లక్షలతో ఆకర్షణీయంగా నిర్మాణం
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు, చిన్నతరహా పరిశ్రమలతోపాటు రైతులు స్వతహాగా ఉత్పత్తి చేసే వస్తువులను విక్రయించేందుకు కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఖనిజాభివృద్ధి సంస్థ నిధులు రూ.20లక్షలతో మన ఉత్పత్తులు – మన గౌరవం భవనాన్ని ప్రత్యే హంగులతో సుందరంగా నిర్మించారు. విక్రయదారులు, వినియోగదారులకు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టారు. చేనేత, వ్యవపాయ రంగాల ప్రాధాన్యాన్ని తెలిపేలా భవనం లోపల చిత్రాలు వేశారు. రంగురంగుల పెయింటింగ్‌తోపాటు అందమైన చిత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే పలు రంగాల్లో ఉత్పత్తి జరిగే వస్తువులకు డిమాండ్ పెరుగనుంది. జిల్లాలో ఉపాధి అవకాశాలు కొంత మేర పెరుగనున్నాయి.
వ్యాపారం చేసేవారికి అవకాశం
మన ఉత్పత్తులు – మన గౌరవం భవనంలో స్వతహాగా తయారు చేసిన వస్తువులు, ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పించాం. స్వతహాగా తయారు చేసుకున్న వస్తువులు, ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని మహిళా సంఘాలు, మహిళా సమాఖ్యలు, రైతులు, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది రైతులు, మహిళా సంఘాల సభ్యులకు ఆదాయ వనరుగా మారనుంది.
– మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీఓ