రామగిరి, డిసెంబర్ 29 : గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో భాగంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో 8వ తరగతి వరకు ఆంగ్ల మాద్యం అమలు చేసి కార్పొరేట్‌కు ధీటుగా విద్యనందిస్తున్నారు. అదే క్రమంలో విద్యార్థులు క్రీడల్లో రాణించేలా చర్యలు తీసుకుంటూ అందుకు అవసరమైన క్రీడా సామగ్రిని అందుబాటులోకి తేచ్చేలా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా నిధులు కేటాయించడంతో పాటు విడుదల చేశారు.
ఫ్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించేలా అందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలుకు ‘క్రీడానిధి’ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా ఆయా పాఠశాలల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ) ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో అవసరమైన క్రీడా సామగ్రిని ఎస్ఎఎంసీ చైర్మన్లు కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,892 పాఠశాలలకు రూ. 1కోటి 47లక్షల 20వేలు మంజూరు చేసింది.
ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ. 10వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా సామగ్రి అందుబాటులోకి రానుండడంపై అటు విద్యార్థులు ఇటు పీడీ, పీఈటీలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చే క్రీడా సామగ్రి పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ కిట్, బాస్కెట్ బాల్, షాట్ పుట్, స్కిప్పింగ్రోప్స్, త్రోబాల్, టెన్నిస్ కిట్ తదితర క్రీడా సామగ్రిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో విద్యార్థులు క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభ చూపేలా తయారుకానున్నారు.
విద్యకు పెద్దపీఠ వేస్తున్న సర్కార్ అందులో క్రీడలకు సైం ప్రాధాన్యమిస్తూ క్రీడానిధి ఏర్పాటు చేయడం హర్షణీయం. ఇప్పటికే మా పాఠశాల విద్యార్థులు పలు క్రీడల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. నూతన క్రీడా సామగ్రి అందుబాటులోకొస్తే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు నిధులను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయాలి. ఇందుకు ప్రభుత్వానికి, విద్యాశాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు
– బొమ్మపాల గిరిబాబు, పీఈటీ, జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నల్లగొండ
ప్రభుత్వ పాఠశాలలకు క్రీడానిధి మంజూరును స్వాగతిస్తున్నా. ఇప్పటికే దాతల సహకారంతో మా పాఠశాలలో కొన్ని ఆట వస్తువులు అందుబాటులోకి తేచ్చాం. క్రీడా సామగ్రి కొనుగోలు నిధులు ఎస్ఎంసీ ఖాతాల్లో జమ చేసి మా గౌరవం పెంచారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. నిధులను పారదర్శకంగా హెచ్ఎం, ఉపాధ్యాయలు, ఎస్ఎంసీ కమిటీ తీర్మానంతో అవసరమైన సామాగ్రి కొనుగోలు చేసి అందుబాటులోకి తెస్తాం.
– ఉబిది యాదయ్య, ఎస్ఎంసీ చైర్మన్, ఎంపీపీఎస్ కత్తాల్గూడ, నల్లగొండ